Leading News Portal in Telugu

సుప్రీంలో జగన్ కు ఊరటా.. చుక్కెదురా? | did really jagan get relief in supreme| daily| hearing| trail| court| bail| cancil| high


posted on Jan 27, 2025 12:12PM

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రికి సుప్రీం కోర్టులో ఒకే రోజు ఊరట, చేదు అనుభవం ఎదురైంది. జగన్ కేసుల విచారణకు వేరే రాష్ట్రానికి తరలించాలనీ, అలాగే జగన్ బెయిలు రద్దు చేయాలనీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన రెండు పిటిషన్లకు సంబంధించి సోమవారం (జనవరి 27) సుప్రీం కోర్టు విచారించింది. ఈ కేసును జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రమిశ్రాలతో కూడిన ధర్మాసం విచారించింది.  ఈ సందర్భంగా జగన్ బెయిలు రద్దు అంశం హైకోర్టు పరిధిలో ఉన్నందున దానిని విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొనడంతో… రఘురామకృష్ణం రాజు కోర్టు అనుమతి తీసుకుని ఆ పిటిషన్ ను ఉససంహరించుకున్నారు. 

ఇదిలా ఉండగా విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న రఘురామకృష్ణం రాజు పిటిషన్ ను  తోసిపుచ్చిన సుప్రీం కోర్టు ఈ కేసును తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తోందని పేర్కొంటూ, ఇటువంటి కేసులలో రోజువారీ విచారణను చేపట్టాలంటూ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు జగన్ కేసుకు కూడా వర్తిస్తుందని పేర్కొంది. దీంతో ఇకపై జగన్ తెలంగాణ హైకోర్టులో జగన్ ఆస్తుల కేసు రోజువారీ విచారణకు రానుందని చెప్పవచ్చు. అంటే ట్రయల్ కోర్టులో ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తుందనీ, రోజు వారీ విచారణ చేపట్టాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయనీ సుప్రీం కోర్టు పేర్కొంది. ఆ కారణంగానే ఈ కేసును మరో రాష్ట్రానికి బదలీ చేయాల్సిన అవసరం లేదనీ పేర్కొంటూ సర్వోన్నత న్యాయస్థానం రఘురామరాజు పిటిషన్ ను తోసిపుచ్చింది.  

ఇక విషయానికి వస్తే రెండు కేసులలోనూ తమకు భారీ ఊరట లభించిందని జగన్ వర్గీయులు సంబరాలు చేసుకుంటుంటే.. న్యాయ నిపుణులు మాత్రం ఇందులో జగన్ కు లభించిన ఊరట ఏదీ లేదని చెబుతున్నారు. కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయడానికి నిరాకరించిన సుప్రీం కోర్టు ఇక జగన్ కేసులు  తెలంగాణ కోర్టు పర్యవేక్షణలో ట్రయల్ కోర్టులో రోజు వారీ విచారణ జరుగుతుందని చెప్పిందనీ, రోజువారీ విచారణ అంటే జగన్ కు ఊరట లభించినట్లు కాదనీ, ఎదురు దెబ్బ తగిలినట్లనీ అంటున్నారు. ఇక బెయిలు రద్దు  విషయం హైకోర్టు పరిధిలో ఉందని కోర్టు పేర్కొనడమంటే.. హైకోర్టును ఆశ్రయించమని రఘురామరాజుకు సూచించినట్లేనని అంటున్నారు.