posted on Jan 27, 2025 1:52PM
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ఏ విధంగా చూసినా ఒక ప్రత్యేక నేత. ఆయన ఉన్నది ఉన్నట్లు చెబుతారు. ఎలాంటి శషబిషలూ ఉండవు. ప్రభుత్వంలో కానీ, పార్టీలో కానీ ఆయన అత్యంత కీలకం అన్న విషయం తెలిసిందే. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం అరహరం ఆలోచించే నారా లోకేష్ సోమవారం (జనవరి 27) విశాఖ వచ్చారు. మంత్రి హోదాలో కాకుండా తన వ్యక్తిగత పని మీద విశాఖ వచ్చానని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఇంతకీ ఆ వ్యక్తిగత పని ఏమిటంటారా.. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఒక మీడియా సంస్థ తన పత్రికలో ప్రచురించిన వార్తపై ఆయన సదరు పత్రికపై పరువునష్టం దావా వేశారు. 2019లో ఆ పత్రికలో చినబాబు చిరుతిండి… 25 లక్షలండి… అన్న శీర్షికన లోకేశ్ పై ఓ కథనం ప్రచురించింది. మంత్రి హోదాలో విశాఖ వచ్చిన సందర్భంగా ఎయిర్ పోర్టు లాంజిలో స్నాక్స్ కోసం ఆయన ఏకంగా పాతిక లక్షల రూపాయలు ఖర్చుచేశారన్నది ఆ పత్రిక ప్రచురించిన కథనం సారాంశం. దానిపై నారా లోకేష్ అప్పట్లోనే సదరు పత్రికకు లీగల్ నోటీసు పంపారు. దానికి సమాధానం ఇవ్వకపోగా పదే పదే అసత్య కథనాలు ప్రచురిస్తుండటంతో లోకేష్ ఆ పత్రికపై పరువునష్టం దావా వేశారు. ఆ కేసు విచారణకు ఆయన విశాఖ వచ్చారు. విచారణ వాయిదా పడింది. తిరుగు ప్రయాణం అవుతూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు.
ఇటీవల లోకేష్ ఉప ముఖ్యమంత్రి అంటూ పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం నేతలూ, శ్రేణులూ కూడా పోటీపడి లోకేష్ కు డిప్యటీ సీఎంగా ప్రమోషన్ అంటే గొంతెత్తారు. ఆ తరువాత పార్టీ ఆదేశాల మేరకు ఎవరూ ఈ విషయంపై గళమెత్తడం లేదనుకోండి. అది వేరు సంగతి. ఇప్పుడు విశాఖలో మీడియా నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. దానికి లోకేష్ చాలా సంయమనంతో ఉప ముఖ్యమంత్రి పదవి అనే కాదు.. పార్టీ అధినేత చంద్రబాబు ఏ పదవి ఇచ్చినా అహర్నిషలూ కష్టపడతా, పార్టీని బలోపేతం చేస్తానని బదులిచ్చారు. ఈ సందర్భంగానే ఆయన ఒక సంచలన విషయం చెప్పారు. ఇప్పటికే తాను రెండు సార్లుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నాననీ, మరో సారి ఆ పదవి తీసుకునే ఉద్దేశం లేదనీ చెప్పారు. అంతే కాదు ఏ వ్యక్తి అయినా వరుసగా రెండు సార్లకు మించి ఒకే పదవిలో ఉండకూడదన్నది తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పారు.