Leading News Portal in Telugu

భవిష్యత్ లో ఇంటికో ఐటీ ప్రొఫెషనల్.. చంద్రబాబు | one ai professional in every house| cbn| future| artificial| inteligence| techno;ogy| for| better


posted on Jan 28, 2025 8:17AM

భవిష్యత్ ను ముందే దర్శించడం చంద్రబాబుకు అలవాటే. గతంలో ఐటీ ప్రభంజనాన్ని ముందుగానే అంచనా వేసిన చంద్రబాబు రాష్ట్రంలో ఐటీ ప్రొఫెషనల్స్ తయారు కావడానికి అవసరమైన విద్యా విధానాన్ని అమలు చేశారు. ఇప్పుడు తెలుగువారు ఐటీ రంగంలో అగ్రగాములుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే భవిష్యత్ అని చెబుతూ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంట్లోనూ ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నారు.

రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్జీజీఎస్)పై సచివాలయంలో సోమవారం (జనవరి 27) సమీక్ష నిర్వహించిన ఆయన ప్రతి ఇంట్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను విరివిగా వినియోగించుకునేలా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు చెప్పరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సమర్ధంగా వినియోగించుకుంటే అద్భుత ఫలితాలు సాధించవచ్చని అన్నారు. సాంకేతికతను ఉపయోగించుకోవడం వల్ల పని తీరు మెరుగౌతుందన్న చంద్రబాబు పాలనలో సాంకేతికత వినియోగంద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలందించగలమన్నారు.  అన్ని ప్రభుత్వ శాఖలూ టెక్నాలజీని సమర్ధంగా ఉపయోగించుకుని పని తీరును మెరుగుపరుచుకోవాలన్నారు.  

15 నుంచి 20 శాతం   వృద్ధి సాధనే లక్ష్యంగా ప్రభుత్వ శాఖలన్నీ పని చేయాలన్నారు. గూగుల్ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని, ప్రభుత్వ శాఖలు ఆర్టీజీఎస్‌తో తమ డేటాను అనుసంధానం చేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విశ్లేషించి ఆయా ప్రభుత్వ శాఖల్లో అమలు చేయ‌ద‌గ్గ విషయాలను గూగుల్ సంస్థ సూచిస్తుందని చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్ సేవలను త్వరలోనే ప్రారంభించనున్నామని ఈ సందర్భంగా చంద్ర బాబు పేర్కొన్నారు. జనన మరణ ధ్రువీకరణ పత్రాలు కూడా వాట్సాప్ ద్వారా పౌరులు పొందే సదుపా యం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల డాటాను అనుసంధానం చేసే ప్రక్రియను వేగంగా జరుగుతోందని  ఆర్టీజీఎస్ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి కె. దినేష్ కుమార్ ఈ సందర్భంగా చెప్పారు. సేకరించిన డేటా ఆధారంగా ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక ప్రొఫైల్ ను రూపొంది స్తున్నామనీ, అలాగే ప్రభుత్వ డేటాలో లేకుండా ఉన్న పౌరుల డేటాను కూడా కొత్తగా సేకరించామని వివరించారు.