posted on Jan 31, 2025 8:55AM
కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం (ఫిబ్రవరి 1) లోక్ సభలో 1925-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సంగతి విదితమే. కాగా లోక్ సభ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం (జనవరి 31) నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు విడతలుగా జరిగే ఈ బడ్జెట్ సమావేశాలలో మొదటి విడత సమావేశాలు శుక్రవారం (జనవరి 31)న ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకూ జరుగుతాయి.
ఇక రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 10న ప్రారంభమై ఏప్రిల్ 4 వరకూ సాగుతాయి. ఇలా ఉండగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం (జనవరి 31) పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగం తరువాత ఆ రోజు కు సభ వాయిదా పడుతుంది. ఆ మరుసటి రోజు అంటే శనివారం (ఫిబ్రవరి 1)న కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశ పెడతారు.
ఈ నేపథ్యంలో గురువారం (జనవరి 30) అఖిలపక్ష సమావేశం జరిగింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ పడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు హాజరు కాగా కాంగ్రెస్ నుంచి జైరామ్ రమేశ్, గౌరవ్ గొగోయ్ హాజరయ్యారు. ఎన్డీయే, ఇండియా కూటమిలోని పార్టీల నుంచి పలువురు ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలపై చర్చించారు. సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించాల్సిందిగా రాజ్ నాథ్ సింగ్ సభ్యులను కోరారు.