కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం.. 990 కోట్ల వ్యయానికి వనరులశాఖ ఆమోదం | water resources department approves 944crores for new diafram wall| polavaram| project| works| jet
posted on Jan 31, 2025 10:53AM
జగన్ ప్రభుత్వ నిర్వాకంతో మూలన పడిన పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పుడు జోరందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి పోలవరం ప్రాజెక్టు అని ప్రకటించిన చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ ఆ ప్రాజెక్టు పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చుకుని అప్పట్లో ప్రాజెక్టును సందర్శించి పనులను పరుగులెత్తించేవారు. దక్షణ భారతదేశంలో అత్యధిక నీళ్లు ఉండే ఏకైక నది గోదావరి. యేటా 3 వేల టీఎంసీల నీరు వృధాగా ఉప్పు సముద్రం పాలౌతోంది. ఆ నీటిని ఒడిసిపట్టి వినియోగించుకుంటే రాష్ట్రంలో కరవు అనేదే ఉండదు.
అటువంటి పోలవరం కోసం చంద్రబాబు 2014 ఎన్నికలలో గెలిచిన తరువాత తన దృష్టినంతా కేంద్రీకరించారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో విలీనం చేసే వరకూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది లేదని పట్టుబట్టి మరీ సాధించుకున్నారు. చంద్రబాబు హయాంలో ఒకే రోజున 32,315 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసి గిన్నిస్ రికార్డ్ సృష్టించారు. 31 సార్లు క్షేత్రస్థాయిలో పోలవరంలో పర్యటించారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే వ్యవసాయానికి ఊతం వస్తుందనే ఉద్దేశంతో ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ క్లియర్ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రూ.11, 762.47 కోట్లు ఖర్చు చేసింది.
అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం పోలవరం పనులను నిలిపివేసింది. రివర్స్ టెండరింగ్ అంటూ అప్పటి వరకూ జోరుగా సాగుతున్న నిర్మాణాలను పడుకోపెట్టేసింది. జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజే ప్రాజెక్టు పనులు నిలిపేసింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే పని చేసే ఏజెన్సీలను తొలగించింది. 2019 జూన్ నుండి నవంబర్ వరకు ప్రాజెక్టు నిర్మాణ పనులు చూసే ఏజెన్సీ కూడా లేదు. ఆ కారణంగానే ఆ తరువాత వరదలతో డయాఫ్రం వాల్ దెబ్బతింది. ఈ విషయాన్ని హైదరాబాద్ ఐఐటీ నిపుణులు స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటు పోలవరం అతీగతీ పట్టించుకోకుండా వదిలేయడంతో అప్పటికే 72శాతం పనులు పూర్తైన పోలవరం పరిస్థితి మొదటికి వచ్చినట్లుగా అయ్యింది. జగన్ నిర్వాకం కారణంగా సర్వనాశనమైన పోలవరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టినా బాగుపడుతుందనే గ్యారంటీ లేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం పగ్గాలు చేపట్టడంతో పోలవరంకు మంచి రోజులు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టుకు జగన్ శాపంగా మారితే.. చంద్రబాబు ఆశాకిరణంగా నిలిచారు.
ఇప్పుడు మళ్లీ పోలవరం పూర్తిపై ఆశలు చిగురించాయి. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తగా 63,656మీటర్ల మేర సమాంతర డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించేందుకు రూ.990 కోట్ల వ్యయం అవుతుందని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరు సమర్పించిన అంచనాకు రాష్ట్ర జలవనరులశాఖ ఆమోదం తెలిపింది. కాగా కొత్త డయాఫ్రమ్ వాల్ పనులను పరిశీలించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందంలోని అమెరికాకు చెందిన డియాన్ ఫ్రాన్ కో డి కికో, డేవిడ్ బి పాల్ శనివారం(ఫిబ్రవరి 1) పోలవరానికి రానున్నారు.