posted on Feb 1, 2025 9:40AM
2025-26 ఆర్థిక సంవత్సరానికి విత్త మంత్రి నిర్మలాసీతారామన్ రూపొందించిన బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పార్లమెంట్ భవన్ లో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. ఇలా ఉండగా నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న తరుణంలో పలువురు రాజకీయ, పారిశ్రామిక వేత్తలతో పాటు సామాన్య జనం కూడా బడ్జెట్ ఎలా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల ఆకాంక్షల మేరకు బడ్జెట్ ఉండాలని కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. అయితే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తదితర సమస్యలతో దేశం సతమతమౌతోందన్నారు. తన వరకూ తనకు నిర్మలా సీతారామర్ ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ పై భారీ ఆశలూ, అంచనాలూ ఏవీ లేవన్నారు.
కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అయితే అందరి కోసం, దేశ ప్రగతి కోసం ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది అని వ్యాఖ్యానించారు. ఇలా ఉండగా కేంద్ర విత్తమంత్రి లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 23 పాయింట్లు, నిఫ్టి 37 పాయింట్ల లాభంతో మొదలయ్యాయి.