అటు బాలకృష్ణ.. ఇటు భువనేశ్వరి.. మధ్యలో చంద్రబాబు.. ఆహ్లాదంగా సాగిన ఫ్యామిలీ పార్టీ | cbn helarious jokes in family party| balakrishan| padmabhushan| bhuvaneswari| counters| smiles
posted on Feb 3, 2025 11:10AM
నందమూరి బాలకృష్ణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి, బాలకృష్ణ సోదరి అయిన నారా భువనేశ్వరి ఫ్యామిలీ పార్టీ నిర్వహించారు. ఈ కుటుంబ వేడుకలకు చంద్రబాబు హాజరయ్యారు. అలాగే ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, నారా, నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ ఫ్యామిలీ పార్టీ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. నవ్వుల పారిజాతాలు పూశాయి. ముఖ్యంగా చంద్రబాబు లోని హాస్యచతురత ఈ పార్టీలో అదనపు ఆకర్షణగా నిలిచింది. చంద్రబాబు చమత్కార బాణాలకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా దీటుగా హాస్యస్ఫోరకంగా ఇచ్చిన సంభాషణలు పార్టీలో నవ్వులు పూయించాయి.
ఈ పార్టీకి ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రబాబుకు మైక్ అందిస్తూ నారా భువనేశ్వరి ఇది రాజకీయ పార్టీ కాదు.. బాలకృష్ణ గురించి మాట్లాడండి, రాజకీయ ప్రసంగంలా గంటలతరబడి కాదు కేవలం ఐదు నిముషాలు మాత్రమే మాట్లాడండి అంటూ టైమ్ లిమిట్ విధించారు. నవ్వుతూ మైక్ అందుకున్న చంద్రబాబు తానిప్పుడు ఇద్దరి మధ్యా ఇరుక్కు పోయానంటూ చమత్కరించారు. ఒక వైపు బాలా మరోవైపు భువనేశ్వరి మధ్యలో నేను అంటూ తన ప్రసంగం మొదలెట్టిన చంద్రబాబు వీళ్లిద్దరి మధ్యన ఉంటే చాలా డేంజర్ అన్నారు. ఆ తరువాత బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించారు. నిన్నటిదాకా అల్లరి బాలయ్య… ఇప్పుడు పద్మభూషణుడు అన్న చంద్రబాబు, ఎన్టీఆర్ ను గుర్తుపెట్టుకునేలా బాలయ్య నడుచుకుంటున్నారనీ, అందుకు ఎంతో గర్వంగా ఉందనీ చెప్పారు. బాలకృష్ణకు పద్మభూషణ్ రావడం మా కుటుంబానికి గర్వకారమన్నారు.
అక్కడితో ఆగకుండా బాలకృష్ణ తనకంటే సీనియర్ అంటూ ఆటపట్టించారు. తన పొలిటికల్ కెరియర్ కంటే బాలకృష్ణ సినిమా కెరియరే ముందు మొదలైందన్నారు. ఇక బసవరామతారకం క్యాన్సర్ ఆస్పత్రిని అద్భుతంగా తీర్చిదిద్దారంటూ బాలకృష్ణ ను పొగడ్తలతో ముంచెత్తారు. బాలకృష్ణ ఈ ఆస్పత్రి బాధ్యతలు చేపట్టిన తరువాతే దేశంలో అగ్రగామి ఆస్పత్రులలో ఒకటిగా బసవరామతారకం ఆస్పత్రి నిలిచిందన్నారు. బాలకృష్ణ తరచుగా తన అర్ధాంగికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని సిఫారసు చేస్తుంటారనీ, అయితే ఆమెను మెప్పించడానికే ఆయన అలా చేస్తున్నారని తాను భావిస్తున్నట్లు చెప్పారు.