Leading News Portal in Telugu

ఈ ఏడాది చివరి నాటికి కర్నూలులో హైకోర్టు బెంచ్! | high court bench in kurnool by end of this year| judges| team| visit| febraury


posted on Feb 3, 2025 10:37AM

మాజీ ముఖ్యమంత్రి జగన్ కర్నూలు న్యాయరాజధాని అంటూ ఐదేళ్ల పాటు పిల్లిమొగ్గలు వేశారు. రాష్ట్రానికి మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణ అంటూ అసలు రాజధానే లేకుండా చేసి, ప్రజాగ్రహానికి గురై అధికారాన్ని కోల్పోయారు. అయితే 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్ర రాజధాని అమరావతి అంటూ ప్రకటించి.. రాజధాని నగర నిర్మాణానికి బాటలు వేశారు. ఆయన హయాంలో శరవేగంగా  నిర్మాణ పనులు సాగాయి. అయితే 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా అధికారపగ్గాలు చేపట్టిన తరువాత ఉద్దేశ పూర్వకంగా అమరావతిని నిర్వీర్యం చేశారు. రాష్ట్రానికి మూడు రాజధానులంటూ కొత్త డ్రామాకు తెరలేపి రాష్ట్రానికి రాజధానే లేకుండా చేశారు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టడంతో మళ్లీ రాజధాని అమరావతి  నిర్మాణ పనులు జోరందుకున్నాయి. తొలి నుంచీ రాష్టరానికి ఒకే రాజధాని, అది అమరావతే అంటూ చెబుతూ వస్తున్న చంద్రబాబు ఆ దిశగా అడుగుల వేగం పెంచారు. అదే సమయంలో విశాఖ, కర్నూలు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టారు.  

ముఖ్యంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ అన్న ఆ ప్రాంత వాసుల చిరకాల డిమాండ్ నెరవేరబోతున్నది. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ మేరకు   కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. కర్నూలులో  హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు అనువైన భవనాన్ని ఎంపిక చేసేందుకు ఈ నెల 6న హైకోర్టు జడ్జీల బృందం కర్నూలులో పర్యటించనుంది.  భవనం ఎంపిక తదితర అంశాలన్నీ సజావుగా పూర్తయిపోయి.. ఈ ఏడాది చివరికల్లా కర్నూలులో హైకోర్టు బెంచ్ ప్రారంభమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.  

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారపగ్గాలు చేపట్టిన తరువాత గత ఏడాది నవంబర్ 21న కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు అసంబ్లీ తీర్మానం చేసింది. అంతకంటే ముందు హైకోర్టు శాశ్వత బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేసే విషయంలో అభిప్రాయాలను తెలియజేయడానికి హైకోర్టు ఫుల్ బెంచ్ ముందు ఈ అంశాన్ని ఉంచాలని కోరుతూ రాష్ట్ర న్యాయసాఖ కార్యదర్శి ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ కు లేఖ రాశారు. దీంతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయమూర్తులతో ఓ కమిటీని వేశారు.  

ఆ కమిటీ నివేదిక మేరకు ఈ ఏడాది జనవరి 29న హైకోర్టు రిజిస్ట్రార్ కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు కావలసిన సదుపాయాల గురించి వివరిస్తూ జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు.  కోర్టు కాంప్లెక్స్,  న్యాయమూర్తులకు సరిపడా మౌలిక సదుపాయాలు, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందికి నివాస వసతి, న్యాయవాదులకు వసతి సౌకర్యాల పూర్తి సమాచారాన్ని పంపాలని ఆ లేఖలో  కోరారు. ఆ లేఖపై కర్నూలు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించారు.  హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన లేఖలో ఉన్న విధంగా సౌకర్యాలు కల్పించేందుకు  భవనాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని  కర్నలు మునిసిపల్ కార్పొరేషన్ చైర్మన్,  ఆర్డీవోలను ఆదేశించారు. ఇప్పుడు 15 మంది న్యాయమూర్తుల బృందం హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అనువైన  స్థలాన్ని పరిశీలించేందుకు కర్నూలు రానుంది. న్యాయమూర్తుల బృందం ఈ నెల6న కర్నూలులో పర్యటించనుంది.  అన్ని సజావుగా జరిగితే ఈ ఏడాది చివరి నాటికే కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.