అభిషేక్ వర్మ పరుగుల సునామీ.. ఐదో టీ20లో ఇంగ్లాండ్ చిత్తుచిత్తు | abishek verma score century| 5th| t20| england| defeated| by| 150
posted on Feb 3, 2025 9:11AM
టి20లలో తనకు తిరుగే లేదని టీమ్ ఇండియా మరోసారి రుజువు చేసుకుంది. స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ ను 4-1తో కైవశం చేసుకుంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన చివరి టీ20లో టీమ్ ఇండియా ఏకంగా 150 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా పరుగుల సునామీ సృష్టించింది.
ముఖ్యంగా అభిషేక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లను సిక్సర్లతో ఓ ఆటాడుకున్నాడు. ఇంగ్లాండ్ పై టి20ల్లో ఫాస్టెస్ సెంచరీ రికార్డు సృష్టించాడు. కేవలం 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన అభిషేక్ వర్మ తన బ్యాటింగ్ లో ఐదు ఫోర్టు కొట్టాడు. ఏకంగా 13 సిక్సర్లు బాదేశాడు. బౌండరీ లైన్ ఆవల పడిన బంతిని తీసుకురావడమే ఇంగ్లాండ్ ఫీల్డర్ల పని అన్నట్లుగా అభిషేక్ వర్మ బ్యాటింగ్ జోరు కొనసాగింది. అభిషేక్ వర్మ బ్యాటింగ్ ధాటికి ఇంగ్లాండ్ బౌలింగ్ అటాక్ కకావికలమైపోయింది. గల్లీ బౌలర్లను ఎదుర్కొంటున్నామా అన్నట్లుగా అభిషేక్ వర్మ బ్యాటింగ్ విధ్వంసం కొనసాగింది. తొలి ఏడు ఓవర్లలో టీమ్ ఇండియా ఏకంగా 111 పరుగులు చేసిందంటేనే ఏ స్థాయిలో ఇంగ్లాండ్ బౌలర్లు ఊచకోతకు గురయ్యారో అర్ధం అవుతుంది.
ఇన్నింగ్స్ మొదటి బంతినే సిక్సర్ గా మలిచిన శాంసన్ త్వరగానే ఔటైపోయాడు. అయితే అభిషేక్ వర్మ తనకు అసలు అడ్డే లేదన్నట్లుగా చెలరేగి పోయాడు. సిక్సర్ల్ మోత మోగించాడు. ఒక దశలో నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ స్కోరు అలవోకగా 300 పరుగులు దాటేస్తుందా అనిపించింది. ఆ స్థాయిలో అభిషేక్ వర్మ బ్యాటింగ్ దాడి ఉంది. అయితే తిలక్ వర్మ , సూర్య కుమార్ యాదవ్ ఫెయిల్ అవ్వడంతో భారత్ పరుగుల వేగం ఒకింత మందగించింది. 10 ఓటర్లు పూర్తయ్యే సరికి మూడు వికెట్ల నష్టానికి 143 పరుగుల స్కోరు వద్ద నిలిచింది.
ఆ తరువాత వచ్చిన శివం దూబె, ఒక సిక్స్ ఒక ఫోర్ తో ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించాడు. కేవలం 13 బంతుల్లో 30 పరుగులు చేసిన శివం దూబె ఔటైన తరువాత వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా సిక్సర్ తో పరుగుల వేట మొదలెట్టినా కుదురుకోలేదు. రింకూ సింగ్ కూడా పెద్దగా రాణించలేదు. 54 బంతుల్లో 13 సిక్సర్లు 7 ఫోర్ లతో 135 పరుగులు చేసిన అభిషేక్ శర్మ చివరకు అవుట్ అయ్యాడు నిర్ణీత 20 ఒవర్లు పూర్తయ్యే సరికి టీమ్ ఇండియా 9 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు సాధించింది.
248 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 10.3 ఓవర్లలో కేవలం 97 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ ఫిల్ సాల్ట్ వినా మరెవరూ భారత్ బౌలింగ్ మందు నిలవ లేకపోయారు. సాల్ట్ 55 పరుగులు చేశాడు. అతడి తరువాత ఇంగ్లాండ్ బ్యటర్లలో జాకెబ్ బెతల్ ఒక్కడే డబుల్ డిజిట్ స్కోరు సాధించాడు. బెతల్ పది పరుగులు చేశాడు. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టగా, వరుణ్ చక్రవర్తి, శివం దుబె, అభిషేక్ వర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్ కి ఒక వికెట్ దక్కింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అభిషేక్ వర్మకు దక్కింది.