posted on Feb 3, 2025 6:17AM
కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం (ఫిబ్రవరి 1) లోక్ సభలో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజాపద్దా కాదా అన్న విషయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
.వరుసగా ఎనిమిదో సారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్.. ఈ ఏడాది తన బడ్జెట్ ప్రసంగాన్ని గురజాడ సూక్తి దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అంటూ ప్రారంభించడం గమనార్హం. తెలుగింటి కోడలుగా ఆమె మహాకవి గురజాడను స్మరిస్తూ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నా.. మధ్య తరగతి జీవులు మాత్రం బడ్జెట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశ పెట్టిన ప్రతిసారీ అది సంపన్నుల కోసమే అన్న విమర్శలు వచ్చేవి. బడ్జెట్ తరువాత దేశీయ స్టాక్ మార్కెట్లు ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగిపోయేవి. ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా, మధ్యతరగతి, సామాన్య ప్రజల నుంచి హర్షం వ్యక్తం అయ్యింది. అదే సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్లు కింది చూపులు చూశాయి. ఆమె ఈ సారి పేదలు, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా బడ్జెట్ ప్రవేశ పెట్టారనడానికి ఇదే తార్కానమని పరిశీలకులు అంటున్నారు.
రూ.50,65,345కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్, రెవెన్యూ వసూళ్లు రూ.34,20,409 కోట్లు. రక్షణ రంగానికి4.91 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధి కి రూ.2.66 లక్షల కోట్లు. వ్యవసాయం,అనుబంధం రంగాలకు రూ.1.71 లక్షల కోట్లు కేటాయించారు.
అది పక్కన పెడితే ఈ సారి ఆమె బడ్జెట్ లో అంశాలను వివరిస్తూ ప్రసంగించడానికి ముందే.. ఆమె ధరించి వచ్చిన చీరపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. త్వరలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఆమె బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు లోక్ సభలో అడుగుపెట్టగానే, ఆమె బీహార్ లో తయారైన కాటన్ చీర ధరించి రావడాన్ని విపక్షాలు విమర్శించాయి. ఎన్నికల స్టంట్ గా అభివర్ణిస్తూ.. ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించి వాకౌట్ చేశాయి.
ఇక తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపుల పట్ల రెండు రాష్ట్రాలలోనూ ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. బడ్జెట్లో ఏపీకి పోలవరం అంచనా ఆమోదం మినహా పెద్దగా ఒరిగిందేమీలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తెలంగాణకు అయితే ఆ మాత్రం కూడా దక్కలేదన్న అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న బీహార్ పై వరాల వర్షం కురిపించడం ద్వారా నిర్మలమ్మ వార్షిక బడ్జెట్ కాదనీ, ఓట్లు దండుకోవడానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్ లా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. .మఖానా బోర్డుతో పాటు,కోసీ కేనాల్,ఐఐటి పాట్నా సామర్ధ్యం తో పాటుగ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం వంటి వరాలు కురిపించడం ద్వారా బీహార్ లో ఎన్నికల ప్రయోజనాలపై మాత్రమే దృష్టి పెట్టారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. వేతన జీవులకు రూ.12 లక్షల వరకూ ఆదాయానికి పన్ను రాయితీ కల్పించడం, 75 వేలు స్టాండర్డ్ డిటెక్షన్ కల్పించడం ద్వారా వారికి భారీ ఊరట కలిగించారని చెప్పవచ్చు. వృద్ధులకు వడ్డీ పై వచ్చే ఆదాయం పై టీడీఎస్ పరిమితిని రూ.50వేల నుంచి లక్షకు పెంచారు. అలాగే అద్దెలపై వచ్చే ఆదాయంపై టీడీఎస్ రూ.ఆరు లక్షలవరకూ పెంచారు. రైతులకు ప్రొత్సాహం అందిస్తామన్నారు. గోదాముల నిర్మాణం, నీటిపారుదల వ్యవస్థ ఆధునీకరణ,రుణాలు సౌకర్యాల కల్పన ద్వారా1.7 కోట్లమంది రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు.కిసాన్ కార్డులు పరిమితి రూ.3లక్షల నుంచి 5లక్షలకు పెంచడం వల్ల 7.7 కోట్ల మంది రైతులకు కొత్తగా ప్రయోజనం కలుగుతుందన్నారు. ఇవన్నీ పీఎం ధనధాన్య యోజన క్రింద 100 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.పప్పుధాన్యాల ఉత్పత్తికి స్వయం సంవృద్ధి పథకం క్రింద ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందనీ, కూరగాయల సాగుకు ప్రత్యేక పథకం ప్రారంభిస్తామనీ, వలసలను అరికట్టడంపై దృష్టి సారిస్తామనీ నిర్మలమ్మ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. విద్యారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించాలని నిర్ణయించారు. అంగన్వాడీల వృద్ధికి నిధులు కేటాయించారు. వచ్చే ఏడాది నుంచి వైద్య కళాశాలల్లో 10వేల సీట్లుపెంచనున్నట్లు ప్రకటించారు ఎస్సీఎస్టీ మహిళలకు టర్మలోన్ పథకాన్ని ప్రకటించారు.ఈ పథకం ద్వారా ఐదు లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని ఆర్ధిక మంత్రి ప్రకటించారు. కొత్త వ్యాపారాల స్థాపనకు, ఉన్న వ్యాపారాల విస్తరణ కు ఈ పథకం చేయూత ఇస్తుందన్నారు. బడ్జెట్లో కేన్సర్ రోగుల,ప్రాణావసరాల మందులు ధరలపై రాయితీ ప్రకటించారు. టీవీలు,మోబైల్స్,తోలు వస్తువులు, స్వదేశీ వస్త్రాల ధరలు తగ్గుతాయి.
స్థూలంగా చూస్తే మందుల ధరలు ప్రాణావసర, కేన్సర్ రోగులవి మాత్రమే తగ్గించారు.కాని సాధారణ మందుల ధరలపై, ఫార్మా కంపెనీలపై జీఎస్టీ బాదుడు నుంచి సామాన్యులకు ఎలాంటి ఊరటా లభించలేదు.
అలాగే పెట్రోల్ ,డిజీల్ తదితరాలపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు 100 శాతం అధికంగా పెంచుతున్నాయి. ఫలితంగా అన్ని వస్తువుల ధరలూ రోజుకో రకంగా పెరుగుతున్నాయి. విద్య,వైద్యం కార్పొరేట్ లకు అప్పగించేసారు.ఈ బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎంతవరకూ మధ్యతరగతి,పేద వర్గాల కు ఉపయోగపడతాయనేది అనుమానమే..వ్యవసాయ రంగానికి, గ్రామీణాభివృద్ధి రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకటించారు కానీ ఆచరణలో గ్రామీణ పేదలకు,రైతులకు ప్రయోజనం కలుగుతుందనడంలో నిజంలేదు. రైతుకు గిట్టుబాటు ధర లభించేవరకూ రైతు కుటుంబం బాగుండదు.ఉత్పత్తి పెరగితే సరిపోదు.రైతు కుటుంబం ఆర్ధికంగా బాగుండాలంటే ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలు ఏమాత్రం ఉపయోగపడవు. ఉత్పత్తి ధరకన్నా అదనంగా క్వింటాల్ కు 50 శాతం అదనంగా ఇస్తేనే గిట్టుబాటు ధర కలుగుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇప్పటికీ 60 శాతం పైగా ప్రజలు వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నారు. అందువల్ల గ్రామీణ భారతాన్ని పటిష్టం చేయాల్సిఉంది. అంటే గ్రామీణ యువతకు ఉపాధి కల్పించాలి.వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ఊతం ఇవ్వాలి. అప్పుడే నిరుద్యోగం తగ్గుతుంది. వ్వవసాయం గిట్టుబాటు కాక కౌలుకు ఇస్తున్నారు. కౌలు రైతులకూ కూడా గిట్టుబాటు కావడంలేదు.
దీంతో వ్యవసాయం కూడా కార్పొరేట్ పరం అయ్యే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే విద్య, వైద్యం, వ్యాపార, పారిశ్రామిక రంగాలు కార్పొరేట్ల పరమయ్యాయి. ముందు ముందు వ్యవసాయం కూడా అదే బాట పట్టే పరిస్థితులను ఈ బడ్జెట్ కల్పించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కైవశం చేసుకున్న కార్పొరేట్ ల చూపు వ్యవసాయం పై పడే అవకాశం ఉంది.అదే జరిగితే..ధనిక, పేద అంతరం మరింత పెరుగుతుంది. ఇక రూ.12 లక్షల వరకూ ఆదాయం పరిమితి ఇచ్చామని చెబుతున్నారు.ఆదాయపన్ను చెల్లించేవారు ఎంతోమంది ఉన్నారు.వారిలో 12 లక్షల వరకూ ఆదాయం పొందేవారు ఎంతమంది ఉంటారనేది బేరిజు వేసుకుంటే నిర్మలమ్మ ఆదాయ పన్ను పరిమితి పెంపు ప్రకటన కంటి తుడుపు చర్యేనని అంటున్నారు. నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతున్నదశలో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ భయం రేపుతున్నది. దీనివల్ల ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడి నిరుద్యోగం మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇక బడ్జెట్ లో చూపిన లోటు కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది.అంటే ధరలు మరింత పెరుగుతాయి. దాని ప్రభావం సామాన్యులపై తీవ్రంగా ఉంటుంది. దాని వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. రూ.50 లక్షల కోట్ల రూపాయలతో నిర్మలమ్మ ప్రవేశ పెట్టిన బడ్జెట్ వల్ల సామాన్యుడికి లభించిన ఊరట అంతంత మాత్రమేనన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.