ఎమ్మెల్సీ కిడ్నాప్? టీడీపీ, వైసీపీ పరస్పర ఆరోపణలు | tirupathi deputy mayor election| mls| kidnap| tdp| ycp
posted on Feb 4, 2025 8:39AM
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక రసవత్తరంగా మారింది. డిప్యూటీ మేయర్ పీఠం కోసం తెలుగుదేశం కూటమి,వైసీపీలు సర్వం ఒడ్డి మరీ ప్రయత్నిస్తున్నాయి. ఇరు పక్షాలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సోమవారం (ఫిబ్రవరి 3)జరగాల్సిన ఈ ఎన్నిక కోరం లేకపోవడంతో మంగళవారం (ఫిబ్రవరి 4)కు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్సీని తెలుగుదేశం కిడ్నాప్ చేసిందంటూ వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నది. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ను తెలుగుదేశం వారు సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆయన నివాసం నుంచి తీసుకువెళ్లారని ఆరోపిస్తున్నది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్సీ ఓటు కీలకం అయిన నేపథ్యంలో వైసీపీ ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరో వైపు ఈ ఆరోపణలను తెలుగుదేశం ఖండించింది.
తిరుపతి డ్యిపూటి మేయర్ ఎన్నికల్లో 22 మంది వైసీపీ కార్పొరేటర్లు కూటమికి మద్దతు తెలిపారని, మరో ఆరుగురు కూడా కూటమికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం చెబుతోంది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా సోమవారం (ఫిబ్రవరి 3) ఉదయం జరిగిన నాటకీయ పరిణామాలను ఉటంకించిన తెలుగుదేశం కార్పొరేటర్లను వైసీపీ వాళ్లే కిడ్నాప్ చేయించుకొని కూటమి ప్రభుత్వంపై నింద మోపేందుకు ప్రయత్నించారని విమర్శించింది.