అసెంబ్లీకి జగన్.. నిజమేనా?.. అహం చంపుకున్నట్లేనా? | jagan to attend assembly| budget| session| leave| aside
posted on Feb 4, 2025 1:38PM
పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ బాట పట్టనున్నారా?.. తన అహాన్ని చంపుకుని ప్రతిపక్ష హోదా లేకున్నా తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి హాజరౌతారా? ఈ నెలలో జరుగుతాయని భావిస్తున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆయనతో సహా వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలూ పాల్గొంటారా? అంటే వైసీపీ సోషల్ మీడియా ఔననే అంటున్నది.
ఇంత కాలం ఆయన అసెంబ్లీకి డుమ్మా కొట్టడానికి ఆయన చెబుతున్న కారణం ప్రతిపక్ష హోదా లేదనే. అర్హత లేకున్నా తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలనీ, తన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనీ కోరుతూ కోర్టుకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. జగన్ ప్రతిపక్ష హోదా డిమాండ్ ను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ప్రజా తీర్పును తాము శిరసావహిస్తామనీ, వారి మేండేట్ కు విరుద్ధంగా జగన్ పార్టీకి విపక్ష హోదా ఇవ్వలేమనీ విస్పష్టంగా చెప్పింది. ఇప్పుడు జగన్ తన అహాన్ని వీడి సాధారణ సభ్యుడిగా అసెంబ్లీకి హాజరు కావడానికి నిర్ణయించుకున్నారు. అసెంబ్లీలో వైసీపీ తెలుగుదేశం, జనసేనల తరువాత మూడో పెద్ద పార్టీగా ఉంటుంది. హౌస్ లో ఆ పార్టీ కంటే బీజేపీకి మాత్రమే తక్కువ సభ్యులు ఉన్నారు. ఆ నిష్పత్తి ప్రకారమే సభలో మైక్ దొరికే సమయం కూడా ఉంటుంది.
ఇక విషయానికి వస్తే.. జగన్ అసెంబ్లీకి రావడమంటూ జరిగితే.. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు సభాధ్యక్ష స్థానంలో ఉండటం ఖాయం. ఆయనను జగన్ ఎలా ఫేస్ చేస్తారన్నది చూడాలి. అయితే ఇప్పటి వరకూ వైసీపీ నుంచి అధికారికంగా అసెంబ్లీకి హాజరుపై ఎలాంటి సమాచారం లేదు. గత అసెంబ్లీ సెషన్ ను జగన్, ఆయన పార్టీ సభ్యులు బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ జరిగినన్నాళ్లు ప్రతి రెండు మూడు రోజులకు ఒక సారి జగన్ తన తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే ఆ విమర్శలను జనం ఇసుమంతైనా పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఇప్పుడు జగన్ తన ప్రతిజ్ణను అంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ చేసిన ప్రతిజ్ణను పక్కన పెట్టి అసెంబ్లీకి హాజరవ్వడమంటే ఆయనలో అహం చచ్చిందనే భావించాల్సి ఉంటుంది. గతంలో అంటే అధికారంలో ఉన్న సమయంలో కూడా ఆయన పలు వాగ్దానాలను భంగం చేశారు. అది వేరే సంగతి. ఇప్పుడు సాధారణ సభ్యుడిలా అసెంబ్లీకి హాజరు కావడానికి సిద్ధమయ్యారంటూ వస్తున్న వార్తలు నిజమే అయితే అది ఆయన పార్టీకి చెందిన మిగిలిన పది మంది ఎమ్మెల్యేలకూ పెద్ద ఊరట అనే చెప్పాలి. జగన్ మాట పట్టుకుని అసెంబ్లీకి డుమ్మా కొట్టడం ద్వారా వారు తమతమ నియోజకవర్గాలలో ప్రజలకు మొహం చూపించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కనీసం వారినైనా కాపాడుకోవాలంటే జగన్ తన అహాన్ని వీడి వాస్తవం గ్రహించి మెసులుకోని తీరాలి.