Leading News Portal in Telugu

తిరుపతిలో భూమన ఆధిపత్యం, పలుకుబడి హుష్ కాకీ! | bhumana lost dominence in tirupathi| reputation| diminished| deputy| mayor| election| tdp


posted on Feb 4, 2025 4:04PM

తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఆధిపత్యానికి చెక్ పడిందా? ఆయన పలుకుబడి పలుచనయ్యిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలలో ఆయన తన సర్వశక్తులూ ఒడ్డి మరీ వైసీపీ అభ్యర్ధి విజయం కోసం పాటుపడ్డారు. అయితే ఆయన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారింది. ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని వ్యూహాలు పన్నినా ఆయన అనుకున్నది సాధించలేకపోయారు. డిప్యూటీ మేయర్ ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్ణి మునికృష్ణ సునాయాస విజయం సాధించారు. మునికృష్ణకు 26 మంది, వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 మంది కార్పొరేటర్లు మద్దతు ఇవ్వడంతో భూమనకరుణాకరరెడ్డికి భంగపాటు తప్పలేదు.

తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి గత ఎన్నికల ముందు తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అలా పోటీ చేయడం కోసం డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేశారు. అయితే విజయం సాధించడంలో విఫలమయ్యారు. అప్పుడు ఆయన రాజీనామా చేయడంతో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవికి ఇప్పుడు ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలలో తన కుమారుడి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో వైసీపీ అభ్యర్థినే గెలిపించడం కోసం భుమన కరుణాకరరెడ్డి చేసిన ప్రయత్నం విఫలమైంది. 

ఈ ఓటమిని జీర్ణించుకోలేని భూమన కరుణాకర్ రెడ్డి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందనీ, అధికార మదంతో తెలుగుదేశం కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి మరీ తమ వైపునకు తిప్పుకుందనీ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో గతంలో అంటే 2021లో అభినయ్ రెడ్డిని డిప్యూటీ మేయర్ గా గెలిపించుకోవడానిక భూమన కరుణాకరరెడ్డి ఓటర్ల జాబితాలోకి నకిలీ ఓటర్లను చేర్చారనీ, తమిళనాడు నుంచి జనాలను తీసుకువచ్చి ఓట్లు వేయించారని ఆరోపణలు వెల్లువెత్తిన విషయాన్ని ఇక్కడ కన్వీనియెంట్ గా మర్చిపోయారు.

ఈ ఆరోపణల విషయాన్ని పక్కన పెడితే ఈ ఓటమి తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి ఆధిపత్యానికి ఫుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి తుడా చైర్మన్ గా 2004 నుంచి 2006 వరకూ చేశారు. ఆ తరువాత 2006 నుంచి 2008 వరకూ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పని చేశారు.  2009లో తిరుపతి నుంచి అసెబ్లీకి పోటీ చేసి చిరంజీవి చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే 2012లో చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికలో పోటీ చేసి భూమన విజయం సాధించారు. ఆ తరువాత 2014 ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ 2019 ఎన్నికలలో తిరుపతి నుంచి విజయం సాధించారు. 2023లో మళ్లీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా జగన్ ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇక 2024 ఎన్నికలలో భూమన కరుణాకరరెడ్డి తాను పోటీ నుంచి తప్పుకుని తన కుమారుడు అభినయ్ రెడ్డిని తిరుపతి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలోకి దించారు. అయితే ఆ ఎన్నికలో అభినయ్ రెడ్డి పరాజయం పాలయ్యారు. 

అయితే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా 2004 నుండి తిరుపతిపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చిన భూమనకు 2024లో వైసీపీ ఘోర పరాజయంతో ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిని గెలిపించుకోవడంతో విఫలమవ్వడంతో ఆయన ఆధిపత్యం, పలుకుబడి పూర్తిగా దిగజారిపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.