Leading News Portal in Telugu

భారీ టాస్క్ తోనే లోకేష్ హస్తిన పర్యటన! | big task behind lokesh delhi tour| meet| union| itminister| techmology| power| house


posted on Feb 4, 2025 3:30PM

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంద్రి నారా లోకేష్ బుధవారం (ఫిబ్రవరి 5) ఢిల్లీ వెడుతున్నారు. ఆయన పర్యటన వెనుక పెద్ద టాస్కే ఉంది. ఈ పర్యటనలో ఆయన కేంద్ర ఐటీ మంత్రి   అశ్విని వైష్ణవ్‌తో  భేటీ కానున్నారు.  లోకేష్ బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెడతారు. సాయంత్రం కేంద్ర మంత్రితో భేటీ అవుతారు. మళ్లీ  అదే రాత్రి తిరిగి అమరావతి చేరుకుంటారు.

ఈ భేటీ అజెండా ఏమిటి? ఇంత హఠాత్తుగా హడావుడిగా ఆయన కేంద్ర మంత్రితో భేటీ అవ్వడానికి కారణమేంటి? ఈ పర్యటనలో ఆయన సాధించుకు వచ్చేదేమిటి? అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదేదో ఆషామాషీ భేటీ కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆర్టిఫిషియల్  ఇంటెలిజెన్స్ (ఏఐ)రంగంలో ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నది. మరీ ముఖ్యంగా వైజాగ్ ను ఏఐ క్యాపిటల్ గా తీర్చిదిద్దాలన్నది లోకేష్ లక్ష్యం. ఇందులో  భాగంగానే విశాఖపట్నంలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు.

ఈ ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాటుపైనే లోకేష్ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో చర్చించనున్నట్లు సమాచారం.  ఏఐ యూనివర్సిటీకి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మూడు ఏఐ  సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించే ఉద్దేశంలో ఉంది. ఈ ఎక్సలెన్స్ సెంటర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కొత్త ఆవిష్కరణలకు దోహదం చేస్తారు. ఇందుకోసం విశాఖలో డేటా సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం కోరేం దుకే నారా లోకేష్ కేంద్ర మంత్రితో భేటీ కానున్నట్లు సమాచారం.  వైజాగ్‌ను టెక్నాలజీ పవర్‌హౌస్‌గా మార్చాలన్న లోకేష్ లక్ష్య సాధనలో భాగంగా కేంద్ర ఐటీ మంత్రితో నారా లోకేష్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.