తాడేపల్లి ప్యాలెస్ లో జగన్.. జిల్లా పర్యటనల ఊసేదీ? | jagan returned from london| confine| to tadepalli| palace| no| mention| district
posted on Feb 4, 2025 2:15PM
రెండు వారాల విదేశీ పర్యటన అనంతరం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వదేశానికి తిరిగి వచ్చారు. అయితే ఆయన నేరుగా ఆంధ్రప్రదేశ్ కు రాలేదు. బెంగళూరు ప్యాలెస్ లో రెండు రోజులు విశ్రాంతి తీసుకుని సోమవారం(ఫిబ్రవరి 3) ఏపీలో ఎంటరయ్యారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు వైసీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తరువాత ఆయన తాపీగా తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకున్నారు. అక్కడ కూడా కొద్ది సేపు పార్టీ నాయకులతో సమావేశమయ్యారు.
ఆయన ఏపీలో అడుగు పెట్టిన తరువాత ఇక పార్టీ కార్యక్రమాలు జోరందుకుంటాయనీ, తమ అధినేత ప్రజలలోకి వస్తారనీ ఆ పార్టీ శ్రేణులు భావించాయి. కానీ అసలు పార్టీ వ్యవహారాల ఊసే లేకపోవడం చూస్తుంటే.. ఆయన ఏపీ పర్యటన తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అన్నట్లుగా ఉందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ముందుగా నిర్ణయించిన మేరకు ఆయన జిల్లాల పర్యటన చేపట్టాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు ఆశగా ఎదురు చూశాయి. అయితే జగన్ ఆ ఊసే ఎత్తలేదు. ఇక ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల చెల్లింపు విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఫీజు పోరు నిరసన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. దీంతో ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో గడపడం వినా ఎటువంటి కార్యక్రమాలనూ చేపట్టరన్నది రూఢీ అయిపోయింది.
గత ఏడాది ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని అందుకుంది. ఇది జరిగి ఎనిమిది నెలలు గడిచిపోయింది. ఈ ఎనిమిది నెలల కాలంలో వైసీపీ అధినేతగా జగన్ ఓటమిపై సమీక్ష నిర్వహించడం కానీ, ఓటమితో నిరాశ చెందిన నేతలు, క్యాడర్ లో ఉత్సాహం నింపడానికి చేసిన ప్రయత్నం కానీ లేదు. అసలు ఆయన ఈ ఎనిమిది నెలల కాలంలో ఏపీలో ఉన్నదే తక్కువ. ఆ ఉన్న తక్కువ సమయంలో కూడా అత్యధిక సమయం తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి నిరసన కార్యక్రమాలను నిర్వహించ లేదు.
అసలు వైసీపీ ఓటమి తరువాత ఒక రాజకీయ పార్టీలా వ్యవహరించిన సందర్భమే లేదు. 2014లో వైసీపీ పరాజయం పాలై ప్రతిపక్షానికే పరిమితమైన సమయంలో జగన్ లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కసి కనిపించింది. దాంతో ఆయన నిత్యం ప్రజల మధ్యలో ఉండి, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే 2019 ఎన్నికలలో విజయం సాధించిన తరువాత ఆయన సుందరముదనష్ట పాలనను జనం చూశారు. సో ఇప్పుడు ఆయన మాటలను విశ్వసించడానికి కానీ, వినడానికి కానీ వారు సిద్ధంగా లేరు. ఆ కారణంగానే జగన్ జిల్లాల పర్యటనకు పార్టీ నేతలే ఉత్సాహం చూపలేదు. ఏర్పాట్లు చేయలేమనీ, జనాలను తరలించలేమనీ చేతులెత్తేశారు. దీంతో జనంలోకి వెళ్లి భంగపడటం కంటే.. ప్రెస్ మీట్లకు పరిమితమై నిరసన వ్యక్తం చేయడమే మేలన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారు.