ప్రతిపక్ష నేతగా తొలగాలి.. కేసీఆర్ కు లీగల్ నోటీసు | step down as opposition leader| legal| notice| to| kcr| federation| farmers| assosiation
posted on Feb 4, 2025 11:03AM
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు బిగ్ షాక్ తగిలింది. 2023 డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలై అధికారానికి దూరమైన సంగతి తెలిసిందే. పార్టీ అధికారం కోల్పోయిన తరువాత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయాలలో ఏమంత క్రియాశీలంగా ఉండటం లేదు.
పార్టీ విపక్షానికి పరిమితమై ఏడాది దాటినా ఇప్పటి వరకూ ఆయన ఒక్కసారి మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు. అంతే ఆయన పూర్తిగా పామ్ హౌస్ కు పరిమితమయ్యారు. అప్పుడప్పుడు ఫామ్ హౌస్ లోనే తనను కలిసిన పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై పోరాడాలి.. లేదా విపక్ష నేత పదవి నుంచి వైదొలగాలి అంటూ లీగల్ నోటీసు అందింది. ఈ నోటీసు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ పంపింది.
ఆ అసోసియేషన్ తరఫున అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి మెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపారు. అసెంబ్లీకి గైర్హాజరౌతున్న కేసీఆర్ కు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగే అర్హత లేదని ఆ నోటీసులో పేర్కొన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి హాజరవ్వాలని కాంగ్రెస్ నేతలు సైతం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ నుంచి లీగల్ నోటీసులు అందడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నోటీసుపై కేసీఆర్ ఎలా స్పిందిస్తారన్నది ఆసక్తిగా మారింది.