posted on Feb 5, 2025 5:53AM
తిరుమలలో మినీ బ్రహ్మోత్సవంగా చెప్పబడే రథ సప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పటిష్టమైన ఏర్పాట్లు చేసిన టీటీడీ రథ సప్తమి ఉత్సవాలను నభూతో అన్నట్లుగా నిర్వహించింది. లక్షలాది మంది భక్తులు స్వామి వారి వాహన సేవలను తిలకించేందుకు తిరుమలకు పోటెత్తారు. అయినా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లూ చేసింది.
ఏటా మాఘశుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు శ్రీమలయప్పస్వామివారి వాహన సేవలు కన్నుల పండువగా జరిగాయి. సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై మాడ వీధులలో విహరించిన స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్తుల గోవిందనామస్మరణ మధ్య స్వామివారి వాహన సేవ అత్యంత వైభవోపేతంగా జరిగింది.