ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. డబ్బులతో దొరికిన సీఎంఓ సిబ్బంది | delhi cmo employees caught with money| assembly| elections| 5lacs| cmpaassistant
posted on Feb 5, 2025 8:28AM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి కార్యాలయ ఉద్యోగులు నగదుతో పోలీసులకు చిక్కడం సంచలనం సృష్టించింది. ఢిల్లీ సీఎంవోకు చెందిన ఇద్దరు ఉద్యోగులు డబ్బుతో తిరుగుతున్నట్లు అందిన పక్కా సమాచారం మేరకు ప్లయింగ్ స్క్వాడ్ వారిని అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకుంది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు ఈ సంఘటన జరిగింది. పట్టుబడిన ఉద్యోగులను గౌరవ్, అజిత్ గా గుర్తించారు. వారికి ఆ నగదు ఎవరు ఇచ్చారు, దానిని వారు ఎక్కడకు తీసుకువెడుతున్నారు అన్న విషయాలపై వారిని విచారిస్తున్నారు. పట్టిబడిన ఇద్దరిలో ఒకరు సీఎం పీఏకు అసిస్టెంట్ కాగా, మరొకరు డ్రైవర్ అని పోలీసులు తెలిపారు.
అదలా ఉంచితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. ఉదయం నుంచే పోలింగ్ బూతుల వద్ద ఓటర్లు బారులు తీరి కనిపించారు. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 699 మంది అభ్యర్థులు తమ బరిలో ఉన్నారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. ఇక పాతికేళ్లుగా ఢిల్లీలో అధకారానికి దూరంగా ఉన్న బీజేపీ ఈ సారి ఎలాగైనా హస్తిన పీఠాన్ని అధిరోహించాలని సర్వశక్తులూ ఒడ్డుతోంది.
పదిహేనేళ్ల పాటుఢిల్లీలో అధికారం చెలాయించి గత రెండు ఎన్నికలలోనూ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ ఈ ఎన్నికలలో పార్టీ ఉనికి, పరువు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. పోటీ ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్యే ఉందని పరిశీలకులు అంటున్నారు. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ ఉందని చెబుతున్నారు. ఇంటి నుంచే ఓటు సౌకర్యం అర్హత ఉన్న 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.