Leading News Portal in Telugu

అయినా మనిషి మారలేదు అతని తీరు మారలేదు! | jagan didnot change even after miserablr defeat| wount


posted on Feb 6, 2025 1:13PM

సీతయ్య అనే సినిమాకు ఓ ట్యాగ్ లైన్ ఉంది. అదేమిటంటే ఎవరి మాటా వినడు అని. ఆ సినిమాకు ఆ ట్యాగ్ లైన్ ఎంత వరకూ యాప్ట్ అన్నది పక్కన పెడితే.. ఎవడి మాటా వినడు అన్న ట్యాగ్ లైన్ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అతికి నట్లు సరిపోతుంది. ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో అధికారం చెలాయించిన జగన్ తన అరాచక పాలన ద్వారా ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసి వచ్చేలా చేశారు. అందుకే గత ఏడాది జరిగిన ఎన్నికలలో జనం ఆయనకు నీ సేవలించ చాలు జగన్ బాబూ అని పక్కన పెట్టేశారు. కనీసం విపక్ష హోదా కూడా దక్కనంత ఘోరంగా ఓడించి   నీకు మా తరఫున మాట్లాడే అర్హత కూడా లేదు అని  ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు చెప్పకనే చెప్పారు. అయినా ఆ విషయం అర్ధం చేసుకోలేని జగన్ జనం కోరుకున్నదే చేశారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రానంటూ అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. ప్రజల తరఫున తాను మాట్లాడనని భీష్మించారు. 

జగన్ పార్టీ ఘోర పరాజయం పాలై ఎనిమిది నెలలు గడిచింది. ఇప్పటికీ జగన్ కు ప్రజలను తనను ఎందుకు ఓడించారో అర్ధం కాలేదు. ఎవరైనా చెప్పబోయినా ఆయన ఎవరి మాటా వినరాయె. అందుకే ఆయన తీరిక దొరికినప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారు. అప్పుడు కూడా ఎవరైనా సరే ఆయన మాట్లాడింది వినాల్సిందే.. వేరే వారు ఎవరైనా మాట్లాడితే ఆయన వినరు. ఇప్పుడు తాజాగా గురువారం (ఫిబ్రవరి 6) ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా కాలం తరువాత తొలి సారిగా ఆయన మీడియా ముందుకు వచ్చారు. తాడేపల్లి ప్యాలెస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశం అంటే పొరబడతారేమో.. జగన్ తాను ఏర్పాటు చేసే మీడియా సమావేశానికి తనకు అనుకూల మీడియాను మాత్రమే ఆహ్వానిస్తారు. ఆ ప్రెస్ మీట్ కు వచ్చన వారంతా ఆయన చెప్పింది విని రాసుకుపోవడం తప్ప మాట్లాడడానికీ, ప్రశ్నలు అడగడానికి ఇసుమంతైనా అవకాశం ఉండదు. గురువారం కూడా జగన్ అలాంటి ప్రెస్ మీట్ లోనే దాదాపు రెండు గంటల పాటు ప్రసంగించారు. 

ఈ రెండు గంటల ప్రసంగం కూడా సింగిల్ పాయింట్ ఎజెండా కేంద్రంగానే సాగింది. మళ్లీ ప్రసంగం అంటే ఆశువుగా తాను చెప్పదలచుకున్నది చెప్పేశారనుకునేరు. కాదు కాదు. రాసుకొచ్చిన లేదా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను ఆయన చదివారు. ఆ స్క్రిప్ట్ మొత్తం తన ఐదేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించే ఉంది. తాను బటన్ నొక్కి పందేరం చేసిన సొమ్ముల గురించే చెప్పుకున్నారు. పనిలో పనిగా ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు కావడం లేదని ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గొప్పగా సంక్షేమం అమలు చేశాననీ, చంద్రబాబు సర్కార్ సంక్షేమాన్ని మూలన పడేసిందన్నదే ఆయన రెండు గంటల ప్రసంగ సారాంశం. 

మరి అంత గొప్పగా సంక్షేమ పథకాలను అమలు చేసిన జగన్ ప్రభుత్వాన్ని జనం ఎందుకంత ఘోరంగా ఓడించారు? ఈ ప్రశ్న ఆ మీడియా మీట్ కు హాజరైన వారెవరూ అడలేదు. అడిగినా ఉపయోగం లేదని వారికి తెలుసు. కనీసం జగన్ కి అయినా ఈ ఎనిమిది నెలల కాలంలో ఆ సందేహం వచ్చిన దాఖలాలు లేవు. 

వాస్తవమేమిటంటే కేవలం ఉచితాలను అందించి అదే సంక్షేమం, అభివృద్ధి అంటే జనం ఆమోదించరనీ, అంగీకరించరనీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ కు తమ తీర్పుతో విస్పష్టంగా చెప్పారు. కానీ ఆ విషయం అర్ధం చేసుకునేందుకు జగన్ సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆయన ఎవరి మాటా వినరు మరి. ఇక విషయానికి వస్తే జగన్ కు పరిపాలన అంటే బటన్ నొక్కడం మాత్రమే. అదొక్కటే సరిపోదని ప్రజలిచ్చిన తీర్పును ఆయన పట్టించుకోరు. తనలా చంద్రబాబు బటన్ లు ఎందుకు నొక్కడం లేదని మాత్రం ప్రశ్నిస్తారు. ఆయన ఇదే తీరులో కొనసాగితే మాత్రం 2024లో ఎదురైన ఘోర పరాభవ పరాజయాన్ని మించిన ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది. ఆయన ఆ దిశగానే ముందుకు సాగుతున్నారనడానికి ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అసెంబ్లీ ఎందకు మీడియా ఉందిగా అన్న ఆయన మాటలే తార్కానం. ఈ మీడియా సమావేశం ద్వారా భవిష్యత్ లో కూడా తాను అసెంబ్లీకి హాజరు కాబోనన్న స్పష్టత ఇచ్చారు. తానే కాదు తన పార్టీ ఎమ్మెల్యేలెవరూ అసెంబ్లీకి హాజరు కారన్న క్లారిటీ కూడా ఇచ్చేశారు.  అంతే జగన్ ఎవరి మాటా వినరు.  అంతే కాదు.. ఎన్ని పరాభవాలెదురైనా మారరు. అంతే జగన్ అంటే అంతే మరి.