రాజకీయ వ్యూహకర్తలకు పెరిగిన గిరాకీ? జమిలికి పార్టీలు రెడీ అవుతున్నాయా? | demand grown for politica strtegists| parties| rush| inview| jamili| elections| one| nation| one
posted on Feb 7, 2025 10:20AM
దేశంలో రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్తల చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్నికలలో తమ గెలుపు వ్యూహాలను రచించి అమలు చేసే కన్సల్టెన్సీల కోసం గాలం వేస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా చాలా గడువు ఉండగానే నేడో రేపో ఎన్నికల నోటిఫికేష్ వెలువడుతుందా అన్నట్లుగా పార్టీలు తమ తమ వ్యూహాలను రచించుకుంటున్నాయి. మొత్తం మీద దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలూ కూడా 2027లో సార్వత్రిక ఎన్నికలు తథ్యమన్న నిర్ణయానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం అమలు దిశగా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయూ ప్రభుత్వం అడుగుల వేగం పెంచిన నేపథ్యంలో 2027లో జమిలి ఎన్నికలు జరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. జమిలి దిశగా కేంద్రం ఇప్పటికే కసరత్తు మొదలెట్టేసిందని రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే రాజ్యాంగ నిపుణులు మాత్రం మూడేళ్లలో జమిలి వచ్చే అవకాశాలు మృగ్యమని చెబుతున్నారు. అయితే పార్టీలు మాత్రం రాజకీయ అవసరాలు, ప్రాధాన్యతల దృష్ట్యా ఇప్పటి నుంచే జమిలికి రెడీ అయిపోతున్నాయి.
జమిలి కసరత్తు నేపథ్యంలో కేంద్రం నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధం చేస్తోంది. అదే జరిగితే దేశ వ్యాప్తంగా లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలలోనూ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 50 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం 175 స్థానాలు ఉండగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆ స్థానాల సంఖ్య 225 కు పెరుగుతుంది. వచ్చే ఎన్నికలలో కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసే పోటీ చేస్తే దీని వల్ల ఎటువంటి ఇబ్బందీ ఉండదు. అయినా ఏ పార్టీకి ఆ పార్టీ తన సొంత రాజకీయ వ్యూహాలను రూపొందిం చుకుంటుం దనడంలో సందేహం లేదు. ఇందులో భాగంగానే లోకేష్ ఇటీవలి హస్తిన పర్యటనలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటీ కావడాన్ని చూడాల్సి ఉంటుంది.
జగన్ రాజకీయంగా యాక్టివ్ కావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయనకు ఐప్యాక్ వ్యూహాలను అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే లోకేష్ ప్రశాంత్ కిశోర్ తో భేటీ అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ వ్యూహాలను చిత్తు చేసేలా ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలు కోరి ఉంటారని అంటున్నారు. ఇప్పటికే టీడీపీకి ప్రశాంత్ కిశోర్ శిష్యుడి ఆధ్వర్యంలోని షఓ టైం కన్సెల్టన్సీ సేవలందిస్తున్నది. ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాకుండా తెలంగాణ సహా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ ఎన్నికల హడావుడి ఇప్పటి నుంచే ఆరంభమైపోయినట్లుగా ఉందని పరిశీలకులు అంటున్నారు.