కమల వ్యూహమా? కాంగ్రెస్ ప్రభావమా? ఆప్ ఓటమికి కారణమేంటి? | reasons for aap defeat in delhi elections| bjp| strategies| congress| failure| indiam kutani
posted on Feb 8, 2025 3:02PM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగంచలేదు. కమల నాథుల రెండున్నర దశాబ్దాలకు పైబడిన ఎదురు చూపులకు తెరపడింది. ఎట్టకేలకు ఢల్లీలో అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడిక వరుసగా 12 ఏళ్ల పాటు ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణాలపై రివ్యూలు మొదలయ్యాయి. రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. ఢిల్లీలో ఆప్ పరాజయానికి, కమల నాథుల విజయానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో మొదటిది కమలనాథుల వ్యూహ పటిమ. రెండోది ఒక జాతీయ పార్టీగా మిత్రపక్షాలను కలుపుకు పోవడంలో కాంగ్రెస్ వైఫల్యం. ఈ రెండు కారణాల వల్లే ఢిల్లీలో బీజేపీ పాగా వేయగలిగింది. ముందుగా కమలం పార్టీ అగ్రనాయకత్వం ఢిల్లీపై 2020 అసెంబ్లీ ఎన్నికల ఓటమి తరువాత నుంచీ ప్రత్యేక దృష్టి పెట్టింది. అప్పటి నుంచీ 2025 ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పావులు కదిపింది. ఆప్ ప్రభుత్వం పని చేయకుండా లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం, శీష్ మహల్ అంశాలను హైలైట్ చేసింది. అదే సమయంలో ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడును ప్రోత్సహించింది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మనీష్ సిసోడియా అరెస్టుకు ఎల్జీ అనుమతి ఇచ్చారు. ఆ తరువాత కేజ్రీవాల్ కూడా అరెస్టయ్యారు. దీంతో ఆప్ అవినీతికి పాల్పడిందన్న ముద్ర జనంలో పడింది. ఇంటా బయటా అని తేడా లేకుండా ఆప్ అవినీతిపై బీజేపీ క్యాడర్ కాళ్లకు బలపాలు కట్టుకుని ప్రచారం చేశారు. ఇవన్నీ ఆప్ పలుకుబడిని ఓ స్థాయిలో పలుచన చేశాయి.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే బీజేపీయేతర పార్టీలకు నాయకత్వం వహించే లక్షణాలు ఆ పార్టీలో కొరవడ్డాయి. ఒక జాతీయ పార్టీగా ప్రభుత్వ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపై నిలపడంలో ఘోరంగా విఫలమైంది. ఇండియా కూటమిగా బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకు రావడానికి ప్రయత్నాలను అయితే ఘనంగా ఆరంభించింది కానీ వాటిని కలిసికట్టుగా ముందుకు తీసుకువెళ్లడంలో ఫెయిలైంది. ఆ కారణంగానే సీట్ల సర్దుబాటు విషయంలో ఆప్ తో సమన్వయం కుదుర్చుకోవడంలో విఫలమైంది. అంతే కాదు.. ఆప్ తో విభేదించి సొంతంగా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ కు ఇండియా కూటమిలోని పార్టీలు కూడా మద్దతుగా నిలవలేదు. ఫలితం ఢిల్లీ ఎన్నికలలో ప్రభుత్వ అనుకూల ఓటు భారీగా చీలిపోయింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ 46.75శాతం ఓట్లు సాధించి విజేతగా నిలిచింది. ఆప్ కు 43.30శాతం ఓట్లు లభించాయి. 70 స్థానాలలోనూ అభ్యర్థులను నిలబెట్టిన కాంగ్రెస్ 7 శాతం ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. ఆ ఓట్లతో ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు కానీ కనీసం 50 స్థానాలలో ఆప్ విజయావకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. కాంగ్రెస్ కు వచ్చిన ఏడు శాతం ఓట్లే ఆప్ ఓటమికి కారణమయ్యాయనడంలో సందేహం లేదు.
వాస్తవానికి ఆప్ ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీయే. సీట్లు సర్దుబాటు చేసుకోలేక విడివిడిగా పోటీ చేసి రెండు పార్టీలూ దెబ్బతిన్నాయి. దెబ్బతినడమే కాదు పువ్వుల్లో పెట్టి మరీ ఢిల్లీ పీఠాన్ని బీజేపీకి అప్పగించాయి. ఈ రెండింటికీ తోడు ఢిల్లీ మద్యం కుంభకోణం, అవినీతి ఆరోపణలు కూడా ఆప్ ఓటమిలో ప్రధాన భూమిక పోషించాయి. మొత్తం మీద ఆప్ ఓటమికి బీజేపీ వ్యూహాలు, కాంగ్రెస్ వైఫల్యమే ప్రధాన కారణమని చెప్పాల్సి ఉంటుంది.