ఆసియా క్రీడలకు ముందు భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. డిఫెండింగ్ ఛాంపియన్, స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొంది. తాను ఆసియా గేమ్స్ లో పాల్గొనటం లేదనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. మోకాలి గాయం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వినేశ్ ఫొగట్ వెల్లడించింది. తనకు బదులుగా ఆసియా క్రీడలకు స్టాండ్ బై ప్లేయర్లను పంపించాలని ఇప్పటికే అధికారులకు తెలిపినట్లు చెప్పుకొచ్చింది.
ఆగస్ట్ 13న రిహార్సల్స్ టైంలో ఎడమ మోకాలికి తీవ్ర గాయమైందని.. స్కాన్లు, పరీక్షల అనంతరం డాక్టర్లు సర్జరీ అనివార్యమని చెప్పారని, ఆగస్ట్ 17న ముంబైలో సర్జరీ చేయించుకోబోతున్నానని వినేశ్ ఫొగట్ వెల్లడించారు. కాగా, చైనాలోని హ్యాంగ్‌ఝౌలో సెప్టెంబన్ 23 నుంచి అక్టోబర్ 8 జరుగనున్న ఆసియా క్రీడల్లో వినేశ్ ఫోగట్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. మహిళల రెజ్లింగ్‌లో ఆమె స్వర్ణం సాధించడం ఖాయమని అందరు అనుకున్నారు. కానీ.. ఇప్పుడు వినేశ్ గాయపడటంతో భారత్ తప్పక గెలవాల్సిన గోల్డ్ మెడల్‌ను కోల్పోవాల్సి వస్తుందని అనుకుంటున్నారు.
వినేశ్ ఫొగట్ స్థానంలో అంతిమ్ పంగాల్ ఆసియా క్రీడల్లో పాల్గొనే ఛాన్స్ ఉందని సమాచారం. 28 ఏళ్ల వినేశ్ 2018 ఏషియన్ గేమ్స్ 50 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. అయితే, ఫొగట్ మాట్లాడుతూ.. అభిమానుల మద్దతు ఇప్పుడు నాకు చాలా అవసరం.. అప్పుడే నేను బలంగా తిరిగి వచ్చి 2024లో పారిస్ వేదికగా జరుగనున్న ఒలింపిక్స్‌కు సిద్ధం కాగలను అని ఆమె తెలిపారు. మీ అందరి మద్దతు నాకు కొండంత బలాన్ని ఇస్తుందని వినేశ్ ఫొగట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.