Independence Day is most important day for me Said Virat Kohli: భారతదేశ వ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖులు అందరూ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. అందరం గర్వించాల్సిన రోజు అని పేర్కొన్నాడు. ఇక తనకు ఈ రోజు (ఆగష్టు 15) చాలా ప్రత్యేకమైనది అని కోహ్లీ తెలిపాడు.
‘స్వాతంత్ర్య దినోత్సం దేశ ప్రజలందరికీ ముఖ్యమైన రోజు. మనం అందరం గర్వించాల్సిన రోజు. ఆగష్టు 15 నాకు మరింత ప్రత్యేకం. ఎందుకంటే.. ఈ రోజే మా నాన్న గారి పుట్టినరోజు. ఈ రెండు ప్రత్యేకతలను ఒకే రోజు నిర్వహించుకోవడం నాకు మరింత సంతోషంగా ఉంటుంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజు నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలున్నాయి. ఈరోజు గాలిపటాలు ఎగురవేయటం ఢిల్లీలో ఆనవాయితీ. అందుకోసం కావాల్సిన వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకొనే వాళ్లం. అది నాకు ఎప్పటికీ గుర్తుంది’ అని విరాట్ కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
విరాట్ కోహ్లీ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. విండీస్ టెస్ట్, వన్డే సిరీస్ అనంతరం స్వదేశానికి తిరిగివచ్చాడు. ఇక ఆసియా కప్ 2023 కోసం సిద్దమవుతున్నాడు. కోహ్లీ ప్రస్తుతం కుటుంబంతో కలిసి ముంబైలో ఉన్నాడు. ఓ వైపు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూనే.. మరోవైపు మహారాష్ట్రలోని అలీబాగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇంటి పనులు చూసుకుంటున్నాడు.