Is there place for Tilak Varma in Indian Squad for Asia Cup 2023: ఈ నెల చివరలో ఆసియా కప్ 2023 ఆరంభం కానుంది. పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు టోర్నీ జరగనుంది. మొదటి మ్యాచ్ పాకిస్తాన్, నేపాల్ జట్ల మధ్య జరగనుంది. ఇక సెప్టెంబర్ 2న దాయాది పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్ జట్లు తమ టీంలను ప్రకటించగా.. భారత్ మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇందుకు కారణం ఆటగాళ్ల గాయాల సమస్యే. గాయపడిన ప్లేయర్స్ కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌ల ఫిట్‌నెస్ రిపోర్టు కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎదురుచూస్తోందని సమాచారం.
ఆసియా కప్ 2023 కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈ వారంలోనే జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ జట్టులో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మకు చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి స్టార్ ఆటగాళ్ల ఫిట్‌నెస్ కాగా.. మరొకటి తిలక్ ఇటీవల చేసిన అద్భుత ప్రదర్శన. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో అరంగేట్రం చేసిన తిలక్.. 5 ఇన్నింగ్స్‌లలో 57.33 సగటుతో 173 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది. మరోవైపు ఒక వికెట్ కూడా పడగొట్టాడు. సీనియర్లు తడబడిన వేల మనోడు క్రీజులో నిలబడి పరుగులు చేశాడు.
ఆసియా కప్ 2023లో తిలక్ వర్మను ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌గా దింపాలని బీసీసీఐ ఆలోచిస్తోందని తెలుస్తోంది. మిడిలార్డర్‌లో లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్‌మెన్ ప్రస్తుతం ఎవరూ లేరు. ఉన్న రిషబ్ పంత్ గాయంతో జట్టుకు దూరంగా ఉన్నాడు. ఒకవేళ ఫిట్‌నెస్ సాధించి కేఎల్ రాహుల్ వచ్చినా వికెట్ కీపర్‌గా ఆడనున్నాడు. తిలక్ వర్మకు ఆసియా కప్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ దక్కుతుందని అందరూ భావిస్తున్నారు. తుది జట్టులో ఆడకున్నా.. జట్టులో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.
ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మలు ఆడతారు. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బరిలోకి దిగుతాడు. శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్ సాధిస్తే.. నాలుగో స్థానంలో బరిలోకి దిగుతాడు. కేఎల్ రాహుల్ పునరాగమనం చేస్తే 5వ స్థానంలో బరిలోకి దిగుతాడు. ఇక హార్దిక్ పాండ్యా 6వ స్థానంలో.. రవీంద్ర జడేజా 7వ స్థానంలో ఆడతారు. అయితే శ్రేయాస్, రాహుల్‌లలో ఏ ఒక్కరు ఆడకున్నా.. తిలక్ వర్మకు ఏకంగా తుది జట్టులో చోటు దక్కడం ఖాయం. మిడిలార్డర్‌లో తిలక్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌గా కూడా బరిలోకి దిగవచ్చు. అయితే సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ రూపంలో మనోడికి గట్టి పోటీ ఎదురుకానుంది. చూడాలి మరి బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో.