టీమిండియా యంగ్ ఓపెనర్, నార్తంప్టన్‌షైర్ స్టార్ ప్లేయర్ పృథ్వీ షా రాయల్ లండన్ వన్డే కప్-2023 నుంచి అర్థంతరంగా తప్పుకున్నాడు. ఈ టోర్నీలో విధ్వంసకరమైన బ్యాటింగ్ తో డబుల్ సెంచరీతో పాటు ఓ సెంచరీ చేసి అద్భుతమైన ఫామ్ లో ఉన్న షా.. డర్హమ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో షా జట్టు నుంచి వైదొలిగాడు. నార్తంప్టన్ యాజమాన్యం పృథ్వీ షాను జట్టు నుంచి రిలీజ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ విషయాన్ని ఆ జట్టు అధికారిక ట్విటర్ అకౌంట్లో వెల్లడించింది.
అయితే, ఈ టోర్నీలో లిడింగ్ రన్ స్కోరర్ అయిన పృథ్వీ షా టీమ్ లో లేకపోవడం తీరని లోటు అని జట్టు యాజమన్యం తెలిపింది. స్కాన్ రిపోర్ట్‌ల్లో షాకు తగిలిన గాయం చాలా తీవ్రమైందని వెల్లడైంది. షా త్వరలో లండన్‌లో బీసీసీఐ ఆధ్వర్యంలోని స్పెషలిస్ట్ డాక్టర్‌ను కలువనున్నాడు.. తక్కువ సమయంలోనే నార్తంప్టన్‌షైర్‌పై పృథ్వీ షా తీవ్ర ప్రభావం చూపించాడు అని ఆ జట్టు కోచ్ జాన్ సాడ్లర్ చెప్పాడు. ఇదిలా ఉంటే, రాయల్ లండన్ వన్డే కప్-2023తో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన పృథ్వీ షా.. నార్తంప్టన్‌షైర్ తరఫున అరంగేట్రం చేసి తొలి రెండు మ్యాచ్‌ల్లో కేవలం 60 రన్స్ మాత్రమే చేశాడు. ఇక్కడి నుంచి షా సుడిగాలి ప్రదర్శన చేశాడు.
ఆగస్ట్ 9న సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా విధ్వంకరమైన బ్యాటింగ్ తో డబుల్ సెంచరీ (153 బంతుల్లో 244; 28 ఫోర్లు, 11 సిక్సర్లు) చేశాడు. ఆ తర్వాత ఆగస్ట్ 13న డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. అయితే, భీకర ఫామ్‌లో ఉన్న పృథ్వీ షా ఈ టోర్నీలో మరిన్ని అద్భుతాలు చేస్తాడనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా తీవ్రంగా గాయపడటంతో నార్తంప్టన్ యాజమాన్యంతో పాటు షా ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఈ కౌంటీ ప్రదర్శనలతో టీమిండియాలోకి పృథ్వీ షా ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అభిమానులు అనుకుంటున్న తరుణంలో ఇలా జరుగటం అతడిని దురదృష్టం వెంటాడుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.