Leading News Portal in Telugu

APL 2023: నేటి మ్యాచ్‌కు శ్రీలీల.. భారత్ vs ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్స్ గెలిచే అవకాశం!


Tollywood Actress Sreeleela to inaugurate APL 2023: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) రాష్ట్రం నుంచి నాణ్యమైన ఆటగాళ్లను సిద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌)ను నిర్వహిస్తోంది. ఏపీఎల్‌ రెండో సీజన్‌కు విశాఖపట్నంలోని వైఎస్సార్‌ స్టేడియం సర్వసన్నద్ధమైంది. ఆగస్టు 16 నుంచి 27 వరకు సీజన్ 2 జరగనుంది. ప్రారంభ మ్యాచ్‌లో తొలి సీజన్‌ టైటిల్‌ పోరులో తలపడ్డ బెజవాడ టైగర్స్‌, కోస్టల్‌ రైడర్స్‌ తలపడనున్నాయి.

గతేడాది నిర్వహించిన ఏపీఎల్‌ సీజన్‌-1కి మంచి ఆదరణ రావడంతో.. సీజన్‌-2ను ఏసీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ భారీగా ప్లాన్ చేసింది. సీజన్‌-2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్టార్ హీరోయిన్ శ్రీలీల పాల్గొననున్నారు. ఆమె తొలి రోజు మ్యాచ్‌ వీక్షించనున్నారు. శ్రీలీల సందడితో వైఎస్సార్‌ స్టేడియం దగ్గరిల్లిపోనుంది. మరోవైపు మ్యాచ్‌లు చూసేందుకు వచ్చే వారు టికెట్లపై పేరు, మొబైల్ నంబర్ రాసి స్టేడియంలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్సులో పెడితే.. లక్కీ డిప్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. 16, 19, 20, 26, 27 తేదీల్లో లక్కీ డిప్‌లో రోజుకు ఐదుగురిని ఎంపిక చేసి.. నవంబర్‌లో జరిగే భారత్ vs ఆస్ట్రేలియా ప్రపంచకప్ మ్యాచ్‌ను వీక్షించేందుకు వారికి ఉచితంగా పాస్‌లు ఇస్తారు.

ఏపీఎల్‌ సీజన్‌-2లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్, వైజాగ్ వారియర్స్, రాయలసీమ కింగ్స్, మార్లిన్ గోదావరి టైటాన్స్, కెవిఆర్ ఉత్తరాంధ్ర లయన్స్ జట్లు ఏపీఎల్‌-2లో పాల్గొంటున్నాయి. రోజుకు రెండు చొప్పున మొత్తంగా 19 మ్యాచ్‌లు జరగనున్నాయి. టైటిల్‌ పోరు ఆగష్టు 27న జరగనుంది. అన్ని మ్యాచ్‌లు ఫ్యాన్‌ కోడ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.