India Squad Update for Asia Cup 2023: పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ 2023 మ్యాచ్‌లు జరగనున్నాయి. 2018 సంవత్సరం తర్వాత తొలిసారిగా 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరగనుంది. నేపాల్ తొలిసారిగా ఆసియా కప్ టోర్నీలో ఆడుతుండగా.. మొత్తంగా 6 జట్లు (భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, నేపాల్) టైటిల్ కోసం తలపడనున్నాయి. హైబ్రీడ్ మోడల్‌లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 13 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ 13 మ్యాచ్‌లలో పాక్‌లో 4, శ్రీలంకలో 9 జరగనున్నాయి.
ఆసియా కప్ 2023 కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ టీమ్స్ తమ జట్లను ప్రకటించాయి. భారత్ సహా శ్రీలంక, అఫ్గానిస్తాన్ జట్లు తమ టీమ్స్ ప్రకటించాల్సి ఉంది. అయితే ఆటగాళ్ల గాయాల అప్‌డేట్ కోసం వేచిచూస్తున్న బీసీసీఐ.. జట్టును ప్రకటించడంలో ఆలస్యం చేస్తోందని తెలుస్తోంది. ఆసియా కప్ కోసం ఆగష్టు 20న భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అయితే వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో విఫలమయిన సంజూ శాంసన్‌ను జట్టు నుంచే తప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.
గాయపడి కోలుకున్న స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడట. అంతేకాదు కీపింగ్ కూడా చేస్తున్నాడట. దాంతో రాహుల్ ఆసియా కప్ 2023 ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. రాహుల్ మెగా టోర్నీలో కీపింగ్ కూడా చేయనున్నాడు. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ ఇంకా 100 శాతం ఫిట్‌గా లేడని తెలుస్తోంది. జట్టు ప్రకటనకు ఇంకా మూడు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో శ్రేయాస్ పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశం లేకపోలేదు.
ఆసియా కప్ 2023కి భారత జట్టు (అంచనా):
రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దల్ ఠాకూర్, యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్.