Leading News Portal in Telugu

IND vs IRE: తొలిసారి బిజినెస్‌ క్లాస్‌ ప్రయాణం.. భావోద్వేగానికి లోనైన టీమిండియా క్రికెటర్!


Rinku Singh shared his experience business class flight for the first time: ఆసియా కప్‌ 2023, ప్రపంచకప్‌ 2023 నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు సీనియర్లు విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. దాంతో ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ కోసం యువ జట్టును ఎంపిక చేసింది. గాయపడి పునరాగమనం చేసిన జస్ప్రీత్ బుమ్రా.. జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లో అదరగొట్టిన రింకు సింగ్‌, జితేశ్ శర్మ, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబె లాంటి యువ క్రికెటర్లు మూడు రోజుల క్రితమే ఐర్లాండ్‌ వెళ్లారు. ముంబై నుంచి విమానంలో బయలుదేరి డబ్లిన్ చేరుకున్నారు.

ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున అదరగొట్టిన రింకు సింగ్.. ఐర్లాండ్‌ వెళ్లే విమానంలో బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించాడు. తొలిసారి బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించడంపై అతడు భావోద్వేగానికి లోనయ్యాడు. ఇదే విషయంపై యువ క్రికెటర్‌ జితేశ్ శర్మతో సంభాషించిన వీడియోను బీసీసీఐ తన ఎక్స్‌లో పోస్టు చేసింది. తొలిసారి బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించానని, ఇందులోని సదుపాయాల గురించి తెలుసుకోవడం కష్టంగానే అనిపించిందని రింకు తెలిపాడు. భారత జెర్సీ కోసం చాలా కష్టపడ్డానని చెప్పాడు.

‘ప్రతి ప్లేయర్ భారత జట్టుకు ఆడాలని కలలు కంటాడు. నోయిడాలో స్నేహితులతో కలిసి ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు భారత జట్టులోకి ఎంపికైన విషయం తెలిసింది. వెంటనే అమ్మకు ఫోన్ చేసి చెప్పా. నేను క్రికెటర్‌గా ఎదగడంలో మా కుటుంబ పాత్ర చాలా కీలకం. నా పేరుతో ఉన్న జెర్సీ, నంబర్‌ను చూసిన తర్వాత మా అమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. భారత జెర్సీ కోసమే నేను చాలా కష్టపడ్డా. ఇప్పుడు సంతోషంగా ఉంది. తుది జట్టులో అవకాశం వస్తే భారత్ విజయం కోసం ప్రయత్నిస్తా. జట్టులోని ప్రతి ఒక్కరితో మాట్లాడా. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఆడాలని సలహా ఇచ్చారు’ అని రింకు సింగ్ తెలిపాడు.

‘పదేళ్ల కిందట జితేశ్‌ శర్మ, నేను ఒకేసారి సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలో ఎంట్రీ ఇచ్చాం. ఇప్పుడు జాతీయ జట్టులోకి కూడా ఒకేసారి ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. ఐర్లాండ్‌ పర్యటనలో ఇంగ్లిష్‌ విషయంలో నాకు జితేశ్‌ సాయంగా ఉంటాడు. మేమిద్దరం తొలిసారి బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించాం. ఇందులోని సదుపాయాల గురించి తెలుసుకోవడం కష్టంగానే అనిపించింది’ అని బీసీసీఐ షేర్‌ చేసిన వీడియోలో రింకు సింగ్ చెప్పాడు.