Leading News Portal in Telugu

UAE vs NZ T20: టీ20 క్రికెట్‌లో యూఏఈ సంచలనం.. పెద్ద జట్టుకు భారీ షాక్!


UAE Defeated New Zealand for the first time in International Cricket: పసికూన యూఏఈ.. టీ20 క్రికెట్‌లో పెద్ద జట్టు న్యూజిలాండ్‌కు భారీ షాక్ ఇచ్చింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో ఓడిన యూఏఈ.. రెండో టీ20లో కివీస్‌ను సునాయాసంగా ఓడించింది. న్యూజిలాండ్‌ నిర్ధేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్స్ మాత్రమే కోల్పోయి మరో 26 బంతులు ఉండగానే గెలిచింది. యూఏఈ కెప్టెన్ మహ్మద్‌ వసీమ్‌ (55; 29 బంతుల్లో 4×4, 3×6) హాఫ్ సెంచరీ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారిగా న్యూజిలాండ్‌ను యూఏఈ ఓడించింది.

రెండో టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 రన్స్ చేసింది. ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (7), కీపర్ డేన్ క్లీవర్ (0), ఆల్‌రౌండర్‌ మిచెల్ సాంట్నర్ (1) తక్కువ పరుగ్గులకే పెవిలియన్ చేరారు. మరో ఓపెనర్ చాడ్ బోవ్స్ 21 రన్స్ చేశాడు. యూఏఈ పేసర్ అయాన్ ఖాన్ చెలరేగడంతో కివీస్ 38 పరుగులకే 4 వికెట్స్ కోల్పోయింది. ఈ సమయంలో చాప్‌మన్‌ (63; 46 బంతుల్లో 3×4, 3×6) ఒంటరి పోరాటం చేస్తూ.. కివీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అతడికి జేమ్స్ నీశమ్ (21) అండగా నిలిచాడు. అయాన్‌ ఖాన్‌ (3/20), జవాదుల్లా (2/16), అలీ నజీర్‌ (1/25) రాణించారు.

లక్ష్య ఛేదనలో యూఏఈకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఆర్యన్ష్ శర్మ డకౌట్ అయ్యాడు. వృత్య అరవింద్ (25) అండతో కెప్టెన్ మహ్మద్‌ వసీమ్‌ జట్టును ఆదుకున్నాడు. ఈ జోడి కివీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని పరుగులు చేశారు. అరవింద్ ఔట్ అయినా అసిఫ్‌ ఖాన్‌ (48 నాటౌట్‌; 29 బంతుల్లో 5×4, 1×6) చెలరేగడంతో యూఏఈ లక్ష్యం దిశగా సాగింది. వసీమ్‌ పెవిలియన్ చేరినా బాసిల్ హమీద్ (12) సాయంతో అసిఫ్‌ మిగతా పని పూర్తిచేశాడు. లక్ష్యాన్ని యూఏఈ 15.4 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో సిరీస్ 1-1తో సమయం అయింది. సిరీస్ డిసైడర్ మూడో టీ20 (UAE vs NZ 3rd T20) నేడు జరగనుంది.