Leading News Portal in Telugu

IND vs IRE: మెరిసిన రుతురాజ్‌, శాంసన్‌, రింకూ.. రెండో టీ20లో ఐర్లాండ్‌ చిత్తు!


Dominant Team India seal series win against Ireland: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ను యువ భారత్ మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో టీ20లో 33 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు మాత్రమే చేసింది. ఆండీ బాల్‌బిర్నీ (72; 51 బంతుల్లో 5×4, 4×6) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ, రవి బిష్ణోయ్‌ తలో రెండు వికెట్స్ పడగొట్టారు. ఇక నామమాత్రమైన చివరి టీ20 బుధవారం జరుగుతుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ (18), తెలుగు ఆటగాడు తిలక్‌ వర్మ (1) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. మరో ఓపెనర్ రుతురాజ్‌ గైక్వాడ్‌ (58; 43 బంతుల్లో 6×4, 1×6), సంజు శాంసన్‌ (40; 26 బంతుల్లో 5×4, 1×6) పరుగులు చేయడంతో భారత్‌ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. శాంసన్‌ ఈ మ్యాచ్‌లో సత్తాచాటాడు. హ్యాట్రిక్‌ ఫోర్లతో పాటు సిక్సర్‌ బాదాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో శాంసన్‌ పెవిలియన్ చేరాడు.

39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రుతురాజ్‌ గైక్వాడ్‌.. ఆ వెంటనే ఔటైపోయాడు. ఈ సమయంలో రింకూ సింగ్‌ (38; 21 బంతుల్లో 2×4, 3×6), శివమ్‌ దూబె (22)లను షాట్స్ ఆడకుండా ఐర్లాండ్ బౌలర్లు అడ్డుకున్నారు. 16, 17, 18వ ఓవర్లలో కేవలం 14 పరుగులే వచ్చాయి. అయితే చివరి రెండు ఓవర్లలో వీళ్లిద్దరూ చెలరేగడంతో భారత్‌ భారీ స్కోరు చేసింది. చివరి రెండు ఓవర్లలో భారత్‌ 42 పరుగులు పిండుకుంది.

ఛేదనలో తొలి రెండు ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 18 పరుగులు చేసిన ఐర్లాండ్‌.. ఆపై తడబడింది. ప్రసిద్ధ్‌ కృష్ణ ఒకే ఓవర్లో స్టిర్లింగ్‌ (0), టకర్‌ (0)ను ఔట్‌ చేశాడు. టెక్టార్‌ (7)ను రవి బిష్ణోయ్‌ బౌల్డ్‌ చేశాడు. ఈ సమయంలో బాల్‌బిర్నీ, క్యాంఫర్‌ (18) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా.. వేగంగా పరుగులు చేయలేకపోయారు. క్యాంఫర్‌ను బిష్ణోయ్‌ ఔట్ చేయడంతో 10 ఓవర్లకు ఐర్లాండ్‌ 63/4గా నిలిచింది. బాల్‌బిర్నీ ఒంటరి పోరాటం చేసినా.. అతడికి అండగా నిలిచే వారు కరువయ్యారు. అర్ధ శతకం అనంతరం బాల్‌బిర్నీ చెలరేగినా అప్పటికి చేయాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. ఆఖర్లో అడైర్‌ (23) అలరించినా ఫలితం లేకుండా పోయింది.