Leading News Portal in Telugu

Chess World Cup 2023: చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నేడు ప్రపంచ నంబర్‌వన్‌ కార్ల్‌సన్‌తో తుది పోరు!


India’s Rameshbabu Praggnanandhaa defeats Fabiano Caruana in Chess World Cup 2023 Semi-Final: భారత యువ చెస్‌ సంచలనం రమేష్‌బాబు ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. సెమీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకు ప్లేయర్ ఫాబియానో కరువానా (అమెరికా)ను ఓడించిన ప్రజ్ఞానంద.. ఈ రికార్డు తన పేరుపై లికించుకున్నాడు. ఇక చెస్ ప్రపంచకప్‌ 2023 ఫైనల్ పోరులో ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌తో ప్రజ్ఞానంద తాడోపేడో తేల్చుకోనున్నాడు.

అజర్‌బైజాన్‌ రాజధాని బాకులో జరిగిన చెస్ ప్రపంచకప్‌ 2023 సెమీ-ఫైనల్‌లో 3.5-2.5 తేడాతో భారత గ్రాండ్‌మాస్టర్ రమేష్‌బాబు ప్రజ్ఞానంద.. అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ కరువానాను ఓడించాడు. హోరాహోరీగా సాగిన సెమీస్‌లో ఆది నుంచి టాప్ ఆటగాడైన కరువానాకు 18 ఏళ్ల ప్రజ్ఞానంద గట్టి పోటీనిచ్చాడు. టైబ్రేక్‌లోనూ పట్టు వదలకుండా పోరాడాడు. తొలి రెండు క్లాసికల్‌ గేమ్‌లు డ్రా కావడంతో.. పోరు టైబ్రేక్‌కు వెళ్లింది. టైబ్రేక్‌లో భాగంగా జరిగిన తొలి రెండు ర్యాపిడ్‌ గేమ్‌లు కూడా డ్రా అయ్యాయి. దీంతో ర్యాపిడ్‌లో రెండో రౌండ్‌కు గేమ్ వెళ్ళింది. అక్కడ పూర్తి ఆధిపత్యం చెలాయించిన ప్రజ్ఞానంద కరువానాను ఓడించాడు.

కరువానాపై చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసిన రమేష్‌బాబు ప్రజ్ఞానంద 2024 క్యాండిడేట్‌ టోర్నీలో చోటు ఖాయం చేసుకున్నాడు. బాబి ఫిషర్‌, మాగ్నస్‌ కార్ల్‌సన్‌ తర్వాత క్యాండిడేట్‌ పోటీల్లో తలపడే మూడో పిన్న వయస్సు ఆటగాడిగా ప్రజ్ఞానంద నిలిచాడు. అంతేకాకుండా 2005లో ప్రపంచకప్‌లో నాకౌట్‌ ఫార్మాట్‌ ప్రవేశపెట్టిన తర్వాత ఫైనల్‌ చేరిన తొలి భారత ఆటగాడు కూడా మనోడే. చెస్ ప్రపంచకప్‌ 2023 టైటిల్‌ పోరులో భాగంగా నేడు తొలి గేమ్‌ జరుగుతుంది.