Sanjay Manjrekar Picks His Playing 11 for IND vs PAK Match in Asia Cup 2023: ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ 2023 జరగనుంది. ప్రపంచకప్ 2023 ఉన్న నేపథ్యంలో ఈసారి 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరగనుంది. శ్రీలంక వేదికగా సెప్టెంబరు 2న పాకిస్తాన్‌తో భారత్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రపంచకప్ సన్నాహకంగా ఆసియా కప్‌ని అన్ని జట్లు ఉపయోగించుకోనున్నాయి. భారత్ ప్రయోగాలకు పోకుండా.. ప్రధాన జట్టుతోనే బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మను ఆడించాలని భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించాడు.
స్టార్ స్పోర్ట్స్‌లో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ భారత తుది జట్టుపై స్పందించాడు. ‘ఓపెనర్లుగా శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ ఆడతారు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ ఉంటారు. మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్ లేదా తిలక్ వర్మలో ఒకరు ఆడుతారు. వీరిద్దరిలో భారత్ మొదటి ప్రాధాన్యం తిలక్‌కే ఉండాలి. ఎందుకంటే టాప్ 7 బ్యాటర్లలో హార్దిక్ పాండ్యాను కలుపుకొని అందరూ రైట్ హ్యాండ్ బ్యాటర్లే. అందుకే లెఫ్టాండర్ అయిన తిలక్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలి. ఏ స్థానంలో ఆడించాలనేది కెప్టెన్ ఇష్టం’ అని మంజ్రేకర్ అన్నాడు.
‘తుది జట్టులో ముగ్గురు సీమర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీకి నేను ఓటేస్తా. నాలుగో సీమర్‌గా హార్దిక్ పాండ్యా ఎలాగూ ఉంటాడు. స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఉండనే ఉన్నారు. జడేజా, హార్దిక్ ఆల్‌రౌండ్ సేవలు టీమిండియాకు ఉంటాయి’ అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. సంజయ్ చెప్పిన విషయాన్నే ఇప్పటికే చాలా మంది మాజీలు కూడా చెప్పారు. జట్టులో లెఫ్టాండర్ ఉంటే బాగుంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కన తిలక్ తుది జట్టులో ఉండే అవకాశాలు లేకపోలేదు.
హైదారాబాదీ స్టార్ తిలక్ వర్మ ఇటీవలే టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో అతడు అరంగేట్రం చేశాడు. ఐదు మ్యాచ్‌లలో 173 పరుగులతో భారత్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సీనియర్లు విఫలమయిన చోట తన అద్భుత బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఒక్క సిరీస్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన తిలక్.. ఒక్క వన్డే కూడా ఆడకుండానే ఏకంగా ఆసియా కప్ వంటి మెగా టోర్నీలో స్థానం సంపాదించాడు.