Leading News Portal in Telugu

Asia Cup 2023: ఆసియా కప్ 2023 కోసం భారత్ భారీ ప్లాన్.. ఏకంగా 15 మంది బౌలర్లు!


Team India has 15 Net Bowlers at NCA for Asia Cup 2023 Practice: ఆసియా కప్ 2023కి సమయం దగ్గరపడుతోంది. టోర్నీ ఆరంభానికి ఇంకా 4 రోజులు మాత్రమే మిగిలున్నాయి. ఆగస్ట్ 30న ముల్తాన్‌ వేదికగా పాకిస్తాన్‌, నేపాల్‌ మధ్య టోర్నీ మొదటి మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా సెప్టెంబర్‌ 2న భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్ ఉంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉన్నాయి. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, భారత్ బోర్డులు జట్లను ప్రకటించగా.. ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంకలు జట్లను ప్రకటించాల్సి ఉంది.

ఆసియా కప్‌ 2023 కోసం భారత జట్టు భారీ స్థాయిలో సన్నద్ధమవుతోంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఏర్పాటు చేసిన స్పెషల్‌ ట్రెయినింగ్‌ క్యాంపులో ఆటగాళ్లు చమటోడ్చుతున్నారు. 4-5 రోజులుగా బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ ప్లేయర్స్ సిద్ధమవుతున్నారు. అయితే సన్నాహక శిబిరం కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తొలిసారిగా 13 నుంచి 15 మంది నెట్ బౌలర్లను నియమించింది. స్టార్ స్పోర్ట్స్ ప్రకారం.. దేశీయ బౌలర్లను సాధ్యమైనంత వరకు ఉపయోగించుకోవడానికి బీసీసీఐ నెట్ బౌలర్ల సంఖ్యను 5 నుంచి 15 వరకు పెంచింది.

పాకిస్థాన్‌కు చెందిన షాహీన్ అఫ్రిది, న్యూజిలాండ్‌కు చెందిన ట్రెంట్ బౌల్ట్ లాంటి లెఫ్ట్ హ్యాండ్ సీమర్లను ఎదుర్కొనేందుకు అనికేత్ చౌదరిని నెట్ బౌలర్‌గా బీసీసీఐ నియమించింది. అనికేత్ భారత్‌లోనే అత్యంత పొడవైన ఎడమచేతి వాటం సీమర్‌. 33 ఏళ్ల అతను రంజీ ట్రోఫీ చివరి సీజన్‌లో రాజస్థాన్‌కు ఆడి 7 మ్యాచ్‌లలో 33 వికెట్లు పడగొట్టాడు. నెట్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్, యశ్ దయాల్, సాయి కిషోర్, రాహుల్ చాహర్ మరియు తుషార్ దేశ్‌పాండేలు ఉన్నారు. వీరందరూ దేశవాళీ క్రికెట్‌, ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారే.