Team India Batting Order confirmed with NCA Training Session Ahead of Asia Cup 2023: పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఆసియా కప్ 2023లో బరిలోకి దిగేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇందుకోసం బెంగళూరులోని ఆలూరులో టీమిండియా శిక్షణ శిబిరం ముమ్మరంగా కొనసాగుతోంది. గాయాల నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్లు కూడా బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే నాలుగో స్థానంలో ఆడేది ఎవరు? అనే చర్చ మాత్రం సోషల్ మీడియాలో ఇంకా కొనసాగుతూనే ఉంది. నాలుగో స్థానంలో సరైన ఆటగాడు విరాట్ కోహ్లీనే అని మాజీలు అంటున్నారు. దీనిపై తాజాగా ఓ క్లారిటీ వచ్చింది.
నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ ఆడుతారని వార్తలు వస్తున్నాయి. నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీనే దిగడం మంచిది అని మాజీలు అంటున్నారు. దాంతో భారత బ్యాటింగ్ ఆర్డర్‌పై గందరగోళం నెలకొంది. దీనిపై తాజాగా ఓ క్లారిటీ వచ్చింది. శుక్రవారం ఆలూరులో నిర్వహించిన శిక్షణ శిబిరంతో జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండనుందో కొన్ని సూచనలు వచ్చాయి. కోహ్లీ మూడో స్థానంలోనే ఆడుతాడని తేలింది.
శుక్రవారం భారత్ ఆటగాళ్లు అందరూ ప్రాక్టీస్ చేశారు. ముందుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ కొత్త బంతితో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఓపెనర్లు ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లను ఎదుర్కొన్నారు. ఆపై విరాట్ కోహ్లీ 3వ స్థానంలో, శ్రేయాస్ అయ్యర్ 4వ స్థానంలో బరిలోకి దిగి బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ మహ్మద్ షమీ, యష్ దయాల్ బౌలింగ్ ఎదుర్కొన్నారు. దీంతో భారత్ బ్యాటింగ్ ఆర్డర్లో ఎలాంటి మార్పులు ఉండవని ఖాయమైంది. ఎప్పటిలానే శ్రేయాస్ 4వ స్థానంలో ఆడనున్నాడు. అయితే శ్రేయాస్ ఫిట్‌నెస్‌ని నిరూపించుకోవాల్సి ఉంది. ఈ రెండు రోజులో అతడి యో-యో టెస్ట్ స్కోర్ రానుంది.