Sourav Ganguly Picks India Squad for World Cup 2023: పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆసియా కప్ 2023 మరో నాలుగు రోజుల్లో ఆరంభం కానుంది. ఈ టోర్నీ కోసం బీసీసీఐ 17 మందితో కూడిన భారత జట్టును ఇటీవలే ప్రకటించింది. మరోవైపు భారత గడ్డపై వన్డే ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. ఈ టోర్నీలో కూడా దాదాపుగా ఇదే జట్టు బరిలోకి దిగనుంది. ప్రపంచకప్ కోసం భారత జట్టును బీసీసీఐ సెప్టెంబర్ 4లోగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ లోగా టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన జట్టును వెల్లడించారు.
ప్రపంచకప్ 2023 కోసం15 మందితో కూడిన జట్టును సౌరవ్ గంగూలీ తాజాగా వెల్లడించారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ, వికెట్ కీపర్ సంజూ శాంసన్‌తో సహా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను దాదా పక్కన పెట్టారు. అయితే ఇటీవలే టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన హైదారాబాదీ స్టార్ వర్మను ఎంచుకోకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో 5 మ్యాచ్‌లలో 173 పరుగులతో భారత్ టాప్ స్కోరర్‌గా నిలవడం, లెఫ్ట్ హ్యాండర్ కూడా కావడం లాంటి సానుకూలతలు ఉన్నా.. దాదా అతడిని విస్మరించారు. దాంతో తెలుగు కుర్రాడిపై ఎందుకు అంత చిన్న చూపు అని కామెంట్స్ చేస్తున్నారు.
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లను టాపార్డర్ లో తీసుకున్న సౌరవ్ గంగూలీ.. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్‌లను మిడిలార్డర్‌లో ఎంచుకున్నారు. వికెట్ కీపర్లుగా కిషన్, రాహుల్‌లను గంగూలీ ఎంపిక చేసిన దాదా.. ఆల్‌రౌండర్‌లుగా హార్దిక్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్‌ను ఎంపిక చేశారు. ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను సెలెక్ట్ చేసారు. జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్‌లను పేస్ కోటాలో ఎంచుకున్నారు.
సౌరవ్ గంగూలీ జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్.