Leading News Portal in Telugu

Asia Cup 2023: విరాట్ కోహ్లీ కాదు.. యో-యో టెస్టు టాప్ స్కోరర్ ఎవరో తెలుసా?! అస్సలు ఊహించలేరు


Shubman Gill Surpassing Virat Kohli In Yo-Yo Test: ఆగస్ట్ 30న ఆసియా కప్ 2023 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. భారత్ అయితే బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఏర్పాటు చేసిన వారం రోజుల ట్రెయినింగ్‌ క్యాంపులో పాల్గొంటుంది. మరోవైపు బీసీసీఐ ఆటగాళ్లకు ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహిస్తోంది. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. యో-యో టెస్టును క్లియర్‌ చేశాడు. తాను 17.2 స్కోర్‌ సాధించినట్లు ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్నాడు. అయితే ఫిట్‌నెస్‌కు మారుపేరైన కోహ్లీ స్కోరునే ఓ యువ ఆటగాడు బీట్ చేశాడు.

టీమిండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ యో-యో టెస్టులో 18.7 స్కోరు సాధించాడు. శుక్రవారం కర్ణాటకలోని ఆలూర్‌లో నిర్వహించిన టెస్టులో గిల్‌ ఈ స్కోర్ సాధించాడు. జట్టులో అందరిలో కెల్లా ఉత్తమ స్కోర్ గిల్‌దే. కెరీర్ ఆరంభం నుంచి ఎంతో ఫిట్‌గా ఉంటున్న విరాట్ కోహ్లీ స్కోరునే గిల్ అధిగమించడం విశేషం. భారత జట్టులో కొనసాగడానికి ఆటగాళ్ల యో-యో టెస్ట్ అర్హత మార్కు 16.5 అన్న విషయం తెలిసిందే.

శుక్రవారం బీసీసీఐ నిర్వహించిన యో-యో టెస్టులో భారత ఆటగాళ్లు పాల్గొన్నారు. ఐర్లాండ్‌ పర్యటన నుంచి తిరిగొస్తున్న జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ, తిలక్‌ వర్మ, సంజు శాంసన్‌లతో పాటు గాయం నుంచి పూర్తిగా కోలుకోని కేఎల్‌ రాహుల్‌ మినహా మిగతా ఆటగాళ్లు అందరూ యో-యో పరీక్షలో పాల్గొన్నారు. అందరూ పాస్ అయ్యారట. భారత క్రికెటర్లలో ఎక్కువ మంది యో-యో టెస్టులో 16.5 నుంచి 18 మధ్య స్కోరు చేస్తారు. అయితే శుభ్‌మన్‌ గిల్‌ ఏకంగా 18.7 స్కోరు సాధించడం విశేషం.

‘యో-యో ఏరోబిక్స్‌.. ప్లేయర్స్ సామర్థ్యాన్ని అంచనా వేసే పరీక్ష. ఎవరు ఎప్పుడు చివరగా మ్యాచ్‌ ఆడారు, గత వారం రోజుల్లో వారిపై పని ఒత్తిడి ఎలా ఉంది, ఫిట్‌నెస్‌ ఎలా ఉన్నాయి అన్న అంశాల ఆధారంగా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఫలితాలు వస్తాయి. శుభ్‌మన్‌ గిల్‌ ఉత్తమంగా 18.7 స్కోరు సాధించాడు. మిగతా ప్లేయర్స్ 16.5-18 మధ్య స్కోరు నమోదు చేశారు’ అని బీసీసీఐ అధికారి ఒకరు ఓ జాతీయ మీడియాకు తెలిపారు.