Neeraj Chopra becomes 1st Indian to win gold at World Athletics Championships: భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సరికొత్త చరిత్రను లిఖించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరిగిన అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో నీరజ్ 88.17 మీటర్ల దూరం జావెలిన్ విసిరి ఈ చారిత్రాత్మక ఫీట్ సాధించాడు. పాకిస్థాన్ త్రోయర్ అర్షద్ నదీమ్ (87.82) రజతం నెగ్గగా.. చెక్‌కు చెందిన వద్లెచ్ (86.67) కాంస్యం సొంతం చేసుకున్నాడు.
నీరజ్ చోప్రా గెలిచిన స్వర్ణంతో మొత్తంగా ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్‌కు లభించిన మూడో పతకం మాత్రమే. ఇంతకుముందు 18 ఛాంపియన్‌షిప్స్‌లో భారత దేశానికి రెండే పతకాలు వచ్చాయి. 2005లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజు బాబి జార్జ్ కాంస్యం సాధించారు. చాలా ఏళ్ల తర్వాత 2022లో ఛాంపియన్‌షిప్స్‌లో నీరజ్ రజతం గెలుచుకున్నాడు. 2023 ఛాంపియన్‌షిప్స్‌లో నీరజ్ పసిడి గెలిచాడు. మూడు పతకాలలో నీరజ్ సాధించినవే రెండు ఉన్నాయి.
నీరజ్ చోప్రా 2016లో ప్రపంచ అండర్ 20 చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచి వెలుగులోకి వచ్చాడు. 2017 ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో మొదటిసారి పాల్గొని.. 15వ స్థానంలో నిలిచాడు. 2017లోనే భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం గెలిచిన నీరజ్.. 2018 ఆసియా క్రీడల్లో, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పసిడి పతకాలు సొంతం చేసుకున్నాడు. ఇక 2021లో ఎవరూ ఊహించని రీతిలో టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించాడు.
2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన నీరజ్ చోప్రా.. 2022 ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో స్వర్ణంతో మెరిశాడు. అదే జోరును కొనసాగిస్తూ.. 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకంతో భారత జెండాను రెపరెపలాడించాడు. తాజా స్వర్ణంతో నీరజ్ అథ్లెటిక్స్‌లోని అన్ని మేజర్ ఈవెంట్లలో పతకాలు నెగ్గిన జావెలిన్ త్రోయర్‌గా రికార్డులో నిలిచాడు.