Leading News Portal in Telugu

World Cup 2023: ప్రపంచకప్‌ 2023కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్‌.. స్టార్ ఆటగాడు దూరం!


Glenn Maxwell injured Ahead of SA vs PAK T20 Series: ప్రపంచకప్‌ 2023 సమీపిస్తున్న తరుణంలో ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ చీలమండ గాయంతో దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. టీ20 సిరీస్‌ కోసం నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా.. మ్యాక్సీ ఎడమ కాలి మడమకు గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో క్రికెట్ ఆస్ట్రేలియా అతడిని టీ20 సిరీస్‌ నుంచి తప్పించింది. మాక్స్‌వెల్ తన భార్యతో కలిసి తిరిగి స్వదేశానికి పయనమైనట్లు ఐసీసీ పేర్కొంది.

గతేడాది స్నేహితుడి పుట్టినరోజు వేడుకలో గ్లెన్ మాక్స్‌వెల్ కాలికి గాయమైంది. దీంతో మ్యాక్సీ ఎడమ కాలు మీద మెటల్ ప్లేట్ ఉంచారు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌ కోసం ప్రాక్టీస్‌ చేస్తుండగా గాయమైంది. నొప్పి ఎక్కువగా రావడంతో మ్యాక్స్‌వెల్‌ను జట్టు నుంచి తప్పించారు. అతడి స్ధానంలో వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ మాథ్యూ వేడ్‌ను సీఏ భర్తీ చేసింది. అయితే ప్రపంచకప్‌ 2023 ప్రారంభానికి ముందు మ్యాక్సీ పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడని ఆసీస్‌ మెనెజ్‌మెంట్‌ భావిస్తోంది.

భారత్‌ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌ 2023కు ముందు ఆస్ట్రేలియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్‌ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్‌, మిచెల్ స్టార్క్‌, డేవిడ్ వార్నర్‌, కామెరూన్ గ్రీన్‌ గాయపడగా.. తాజాగా ఈ జాబితాలో గ్లెన్ మాక్స్‌వెల్‌ చేరాడు. ప్రపంచకప్‌కు ముందు భారత్‌లో జరిగే వన్డే సిరీస్‌కు మాక్స్‌వెల్‌ అందుబాటులో ఉంటాడని ఆసీస్‌ మెనెజ్‌మెంట్‌ భావిస్తోంది. ప్రపంచకప్‌కు 17 మంది సభ్యులతో కూడి ప్రిలిమనరీ జట్టును క్రికెట్‌ ఆస్ట్రేలియా ఇటీవల ప్రకటించింది. ఆ జట్టులో మాక్స్‌వెల్‌ ఉన్నాడు. దక్షిణాఫ్రికా టూర్‌లో భాగంగా ఆతిథ్య ప్రోటీస్‌తో 3 టీ20లు, 5 వన్డేలు ఆసీస్ ఆడనుంది.