KL Rahul to Miss Pakistan and Nepal matches in Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఆరంభానికి ముందే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. చాలాకాలం తర్వాత జట్టుకు ఎంపికైన స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్.. తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకుండా పోయాడు. ఈ విషయాన్ని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపారు. ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్థాన్, నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లకు రాహుల్ దూరం కానున్నాడు. అతడి స్థానంలో భారత్ మేనేజ్మెంట్ ఎవరికి చోటు ఇస్తుందో అనే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.
ఆసియా కప్ 2023లో సెప్టెంబర్ 2న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ తుది జట్టు ఎలా ఉంటుందో అని అందరూ ఉత్కంఠగా చుస్తున్నారు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగితే.. కేఎల్ రాహుల్ 5వ స్థానంలో బరిలోకి దిగుతాడని అందరూ అనుకున్నారు. వికెట్ కీపర్‌గా అతడే అని భావించారు. అయితే సరైన ఫిట్‌నెస్ లేని కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు రాహుల్ అందుబాటులో ఉండటం లేదు.
కేఎల్ రాహుల్ స్థానంలో సంజు శాంసన్‌కు అవకాశం ఇస్తారా? లేదా ఇషాన్ కిషన్‌ను తీసుకుంటారా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇటీవలి ఫామ్ కారణంగా ఇషాన్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి కెప్టెన్ రోహిత్ శర్మ ఎవరికి ఓటేస్తాడో చూడాలి. సీనియర్ ఆటగాడు రాహుల్ దూరం కావడం భారత్‌కు ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఇటీవల గాయం నుంచి కోలుకున్న రాహుల్.. బెంగళూరులోని శిక్షణా శిబిరంలో బ్యాటింగ్ కూడా చేశాడు. ఇంకా 100 శాతం ఫిట్‌నెస్ లేని కారణంగానే అతడు ఆడడం లేదు.