భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) 70వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని సేవలను కొనియాడారు. క్రికెట్ కోసం అద్భుతమైన మౌలిక సదుపాయాలను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన 1983 ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యుడు రోజర్ బిన్నీ తన రంజీ ట్రోఫీ రోజులను గుర్తుచేసుకున్నాడు. ముఖ్యంగా విశాఖపట్నంలోని రైల్వే స్టేడియంలో ఆంధ్ర జట్టుతో ఆట ఆడినప్పుటి రోజులను గుర్తు చేసుకున్నాడు.
భారత్ లో అక్టోబరు- నవంబరులో జరిగే ఐసీసీ 2023 ప్రపంచ కప్ పోటీల్లో హాట్ ఫేవరేట్ భారత్ నే బరిలోకి దిగుతుందని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ అన్నారు. ప్రతి భారతీయుడి ఆశ అదే.. 1983లో వరల్డ్ కప్ నెగ్గిన జట్టులో సభ్యుడిగా ఉండడం నాకు మధుర జ్ఞాపకమే అని ఆయన పేర్కొన్నారు. 1975 లో విశాఖలో మ్యాచ్ అడాను, మౌళిక సదుపాయాల పరంగా ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది అన్నారు. ఏళ్ల తరబడి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌ను అభివృద్ధి చేయడం అభినందనీయమని రోజర్ బిన్నీ తెలిపారు. దేశంలోనే అత్యుత్తమమైన క్రికెట్‌కు మంచి మౌలిక సదుపాయాలను కల్పించినందుకు ఏసీఏ గర్వపడాలి అని బీసీసీఐ చీఫ్ బిన్నీ అన్నాడు.
ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడితో పాటు మాజీ భారత క్రికెటర్ మదన్ లాల్, మాజీ రంజీ క్రీడాకారులు, మాజీ మహిళా సీనియర్ క్రీడాకారులు, ఏసీఏ సిబ్బంది- కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారని, భవిష్యత్తులో వారు దేశం కోసం ఆడతారని మాజీ క్రికెటర్ మదన్ లాల్ అన్నారు. ప్రతిభావంతులైన, వర్ధమాన క్రికెటర్లను ప్రోత్సహించేందుకు ఏసీఏ ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించడం అభినందనీయమన్నారు.