Leading News Portal in Telugu

World Cup 2023: బీసీసీఐ.. డ్రామాలాడొద్దు! మ్యాచ్‌ హైలైట్స్‌ చూడాలా ఏంది?


Fans Trolls BCCI Over World Cup 2023 IND vs PAK Tickets: భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్‌ 2023 అక్టోబర్ 5 నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ, బీసీసీఐ.. టికెట్స్ విక్రయాలను కూడా ఆరంభించాయి. అక్టోబర్ 14న జరగనున్న భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు సంబంధించి కొన్ని టికెట్లను మంగళవారం (ఆగష్టు 29) సాయంత్రం 6 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచారు. ఈ మ్యాచ్ టికెట్స్ కోసం ఫాన్స్ ఎగబడ్డారు. కేవలం గంట వ్యవధిలోనే ‘సోల్డ్‌ ఔట్‌’ అని బుక్‌మై షో యాప్‌ సహా వెబ్‌సైట్‌లో మెసేజ్ కనిపించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు సంబంధించి కొన్ని టికెట్లను మాత్రమే బుక్‌మై షో అందుబాటులో ఉంచామని, సెప్టెంబర్‌ 3న మరో సేల్‌ ఉంటుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే ఎన్ని టికెట్లను అందుబాటులో ఉంచారో బీసీసీఐ వెల్లడించలేదు. దాంతో ఫాన్స్ బీసీసీఐపై మండిపడుతున్నారు. ఎన్ని టికెట్స్ అందుబాటులో ఉంచారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. టికెట్ల కోసం ఆన్‌లైన్‌ క్యూలో ఉన్నప్పటికీ.. టికెట్‌ జారీకి 4 గంటల నుంచి ఏకంగా 4 నెలల అంచనా సమయం కనిపించడంతో ఫాన్స్ అసహనానికి లోనయ్యారు. దాంతో సోషల్ మీడియా వేదికగా బీసీసీఐని ఏకిపారేస్తున్నారు.

‘టికెట్ల లైన్‌లోకి అనుమతించిన బుక్‌మైషో.. టికెట్ ఇవ్వడానికి మాత్రం 4 నెలల సమయం తీసుకుంటుంది. అప్పుడు టికెట్ ఇస్తే నేను మ్యాచ్‌ హైలైట్స్‌ చూడాలా?’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ఇదొ పెద్ద స్కాం. ఐసీసీ, బీసీసీఐ చెత్త టికెట్‌ బుకింగ్‌ సిస్టమ్‌ను ఎంపిక చేశాయి. భారత్‌ మ్యాచ్‌లకు సంబంధించి ఒక్క టికెట్‌ కూడా బుక్‌ చేసుకోలేకపోయా’ అని ఇంకొకరు ట్వీటారు. ‘బుక్‌మైషో ఎంత అసహ్యంగా ఉందో మీరు వీడియోలో చూడవచ్చు. టికెట్లు అమ్మకూడదనుకుంటే డ్రామాలు చేసి మా భావోద్వేగాలతో ఆడుకోకండి’, ‘ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డు బీసీసీఐ ఏర్పాటు చేయించిన టికెట్‌ బుకింగ్‌ సిస్టమ్‌ ఇలా ఉంది’ అని నెటిజన్లు కామెంట్స్ పెట్టారు.