ఇవాళ( ఆగస్ట్ 30 ) ఆసియా కప్ 2023లో భాగంగా ముల్తాన్ వేదికగా నేపాల్‌తో జరుగుతున్న టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్‌లో పాక్ సారథి బాబర్ ఆజమ్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 109 బంతులు ఆడిన బాబర్ 10 బౌండరీల సాయంతో కెరీర్‌లో 19వ సెంచరీని నమోదు చేశాడు. దాంతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలో 15వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ సెంచరీల రికార్డును సమం చేశాడు. సయీద్ అన్వర్ (20) తర్వాత పాక్ తరఫున అత్యధిక వన్డే శతకాలు బాధిన పాకిస్థాన్ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
వన్డే క్రికెట్‌లో పాకిస్థాన్ సారథి బాబర్ ఆజమ్ ప్రపంచ రికార్డు సాధించాడు. అత్యంత వేగంగా 19 సెంచరీలు చేసిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. బాబర్‌కు 19 సెంచరీలు సాధించేందుకు కేవలం 102 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఏ ఇతర ఆటగాడు ఇంత వేగంగా 19 సెంచరీల మార్కును అందుకోలేకపోయాడు. బాబర్ ఆజమ్ కు ముందు ఈ రికార్డు సౌతాఫ్రికా హషీమ్ ఆమ్లా (104 ఇన్నింగ్స్‌ల్లో) పేరు మీద ఉండేది. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 124 ఇన్సింగ్స్, ఏబీ డివిలియర్స్ 171 ఇన్నింగ్స్‌ల్లో 19 సెంచరీల మార్కును అందుకున్నారు.
ఇక, కెప్టెన్ బాబర్ ఆజామ్ (131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 151 పరుగులు ) భారీ శతకంతో విరుచుకుపడడంతో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. దీంతో నేపాల్ ముందు 343 పరుగుల లక్ష్యం ఉంది. బాబర్ తో పాటు ఇప్తికార్ అహ్మద్ ( 71 బంతుల్లో 11ఫోర్లు, 4 సిక్సర్లతో 109 నాటౌట్ ) కూడా దంచి కొట్టడంతో పాక్ భారీ స్కోరు చేసింది. మిగిలిన వారిలో మహ్మద్ రిజ్వాన్(44) రాణించాడు. నేపాల్ బౌలర్లలో సోంపాల్ కామి రెండు వికెట్లు తీయగా కరణ్ కెసి, సందీప్ లామిచానేలు తలో వికెట్ తీసుకున్నారు.