Leading News Portal in Telugu

Asia Cup 2023: ఆసియా కప్ చరిత్రలో అత్యధిక సార్లు టైటిల్స్ గెలిచిన టీమ్ ఏదో తెలుసా?


Asia Cup Winners List from 1984 to 2023: ఆసియా దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి, ఉన్నతస్థాయికి చేరుకోవడానికి ‘ఆసియా క్రికెట్‌ కౌన్సిల్’ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే ‘ఆసియా కప్’. ముందుగా కేవలం మూడు జట్లతోనే ప్రారంభమైన ఈ టోర్నీ.. ఇప్పుడు ఆరు టీమ్‌లతో నిర్వహించే స్థాయికి ఎదిగింది. ప్రతి రెండేళ్లకు ఓసారి ఆసియా కప్‌ను నిర్వహించాలని భావించినా.. కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన సందర్భాలూ ఉన్నాయి. ఆసియా కప్ ప్రస్తుతం పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా జరుగుతోంది. ఇది 16వ ఎడిషన్. ఈ ఎడిషన్‌లో తొలిసారిగా నేపాల్ జట్టు ఆడుతోంది.

1984లో యూఏఈలో ఆసియా కప్‌ తొలిసారిగా జరిగింది. మొదటి సీజన్‌లో భారత్ విజేతగా నిలిచింది. 1986, 1988, 1990 వరకు ప్రతి రెండేళ్లకొకసారి జరిగిన టోర్నీ.. ఐదేళ్ల తర్వాత 1995లో పునఃప్రారంభమైంది. 1997లో జరిగిన టోర్నీ.. మూడేళ్ల తర్వాత 2000లో జరిగింది. ఆపై పలు కారణాల వల్ల ఆసియా కప్‌ టోర్నీని 2004లో నిర్వహించారు. 2008లో జరిగిన ఆసియా కప్‌.. ఆ తర్వాత ప్రతి రెండేళ్లకొకసారి 2010, 2012, 2014, 2016 వరకు జరిగింది. మళ్లీ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత 2022లో ఆసియా కప్‌ జరగ్గా.. ఏడాది వ్యవధిలోనే 2023లో జరుగుతోంది. ఇది 16వ ఎడిషన్ కాగా.. కేవలం రెండుసార్లు మాత్రమే (2016, 2022) టీ20 ఫార్మాట్‌లో జరిగింది.

ఆసియా కప్‌ టోర్నీలో భారత్ అత్యధిక సార్లు టైటిల్స్ గెలిచింది. టీమిండియా ఏడు సార్లు (1984, 1988, 1991, 1995, 2010, 2016, 2018) విజేతగా నిలిచింది. భారత్ సాధించిన ఏడు టైటిల్స్‌లో ఆరు వన్డే ఫార్మాట్‌లోనే వచ్చాయి. 2018 ఎడిషన్‌ను గెలుచుకున్న భారత్.. వన్డే డిఫెండింగ్ ఛాంపియన్‌గా 2023లో బరిలోకి దిగుతోంది. ఈ రికార్డ్స్ చూస్తే.. ఆసియా కప్‌లో టీమిండియాదే హవా అని ఇట్టే తెలిసిపోతుంది. 1984లో మొదలైన టోర్నీలో భారత్ 49 వన్డేలు ఆడి.. 31 గెలిచింది.

ఆసియా కప్‌ టోర్నీలో భారత్ తర్వాత అత్యధిక సార్లు టైటిల్స్ గెలిచిన జట్టుగా శ్రీలంక ఉంది. లంక ఆరు (1986, 1997, 2004, 2008, 2014, 2022) ఆసియా కప్‌ టైటిల్స్ గెలిచింది. పాకిస్థాన్ రెండు సార్లు (2000, 2012) ఆసియా కప్‌ అందుకుంది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు.