Jasprit Bumrah Plays FIFA With Wife Sanjana Ganesan Ahead of IND vs PAK Match: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా మ్యాచ్‌కు సమయం అసన్నమైంది. ఆసియా కప్ 2023లో భాగంగా మరో రెండు రోజుల్లో దాయాదులు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. సెప్టెంబర్ 2న శ్రీలంకలోని కాండీ వేదికగా ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇండో-పాక్ ఆటగాళ్లు ముమ్మర సాధన చేస్తున్నారు. ఆధిపత్యం చెలాయించేందుకు ఇరు జట్లు ప్రాక్టీస్ చేస్తూ చెమటోడ్చుతున్నారు. అయితే భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం తన సతీమణి సంజనా గణేషన్‌తో కలిసి ఫుట్‌బాల్ గేమ్ ఆడాడు.
దాదాపు సంవత్సరం తర్వాత ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన జస్ప్రీత్ బుమ్రా.. ఆసియా కప్ 2023 కోసం సిద్ధమవుతున్నాడు. టోర్నీలో భారత్ ఆడే మొదటి మ్యాచ్ పాకిస్థాన్‌తో తలపడేందుకు సన్నద్ధమవుతున్నాడు. అయితే పాక్ మ్యాచ్‌కు ముందు కాస్త సమయం దొరకడంతో తన సతీమణి సంజనా గణేశన్‌తో కలిసి ఫిఫా ఆన్లైన్ ఫుట్‌బాల్ గేమ్‌ను ఆడాడు. ఇందుకు సంబందించిన వీడియోను బుమ్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.
జస్ప్రీత్ బుమ్రా షేర్ చేసిన వీడియోపై నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. ‘అన్నయ్య.. నెమ్మదిగా ఆడుకో. లేదా నీ బొటన వేలికి గాయం అవుతుంది’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. ‘బ్రదర్ సెమీ ప్రోలో ఆడండి.. గాయపడకండి’ అని ఇంకొకరు ట్వీట్ చేశారు. ‘నువ్ ఆడుతుంటే భయమేస్తుంది బయ్యా’, ‘బుమ్రా ఆన్లైన్ గేమ్ ఆడుతున్నా.. ఫాన్స్ అందరూ ఆందోళనలో ఉన్నారు’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ చేయడానికి కారణం.. బుమ్రా ఇటీవలి కాలంలో గాయాల బారిన పడడమే. ఐపీఎల్ మినహా మెగా టోర్నీలలో అతడు పాల్గొన్న సందర్భాలు తక్కువగా ఉన్నాయి.