భారత క్రికెట్ నియంత్రణ మండలి మీడియా హక్కులను వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీకి చెందిన వయాకామ్18 కంపెనీ దక్కించుకుంది. ఈ సంస్థ టీమిండియా స్వదేశంలో ఆడే మ్యాచ్‌ల టీవీ ప్రసార హక్కులతో పాటు డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. భారత క్రికెట్ జట్టు ఇండియాలో ఆడే మ్యాచ్‌లు స్పోర్ట్స్ 18 ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తుండటంతో.. ఈ మ్యాచ్‌లు జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ అవుతాయి. జియో సినిమా ఇంతకు ముందే ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ రైట్స్ ను కూడా దక్కించుకున్న విషయం విధితమే..
సెప్టెంబర్ 2023 నుంచి మార్చి 2028 వరకు ఐదేళ్ల కాలానికి సంబంధించి భారత ద్వైపాక్షిక సిరీస్‌ల ప్రసార హక్కుల ఈ- వేలం నేడు (గురువారం) జరిగింది. బీసీసీఐ మీడియా హక్కుల కోసం డిస్నీ స్టార్, సోనీ, వయాకామ్18 పోటీ పడ్డాయి. అయితే, డిజిటల్, టీవీ హక్కులకు వేర్వేరుగా బీసీసీఐ వేలం నిర్వహించింది. దీని కోసం వరుసగా మ్యాచ్‌కు టీవీకి రూ.20 కోట్లు, డిజిటల్‌కు 25 కోట్ల నుంచి వేలం వేశారు. ఇక, వయాకామ్18 సంస్థ ఈ ఐదేళ్లలో ద్వైపాక్షిక సిరీస్‌ల్లో టీమ్‌ఇండియా 25 టెస్టులు, 27 వన్డేలు, 36 టీ20లు ఆడనుండగా వాటిని ప్రసారం చేయనుంది.