Leading News Portal in Telugu

Hockey 5s Asia Cup 2023: క్రికెట్‌లో ఫట్.. హాకీలో హిట్.. ఫైనల్లో పాకిస్తాన్‌ ఓటమి


Hockey 5s Asia Cup 2023: వరుణుడి దెబ్బకి ఆసియా కప్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల తర్వాత దాయాదిలు బరిలో నిలవడంతో పోరు రసవత్తరంగా ఉంటుంది అభిమానులు తెగ సంబరపడ్డారు. కానీ వాన కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇది ఇలా ఉంటే శనివారం జరిగిన ఫైవ్స్ ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి భారత పురుషుల ఆసియా కప్ జట్టు టైటిల్ గెలుచుకుంది. పెనాల్టీ షూటౌట్‌లో భారత్‌ 2-0తో విజయం సాధించింది. పూర్తి సమయం ముగిసే సమయానికి మ్యాచ్ 4-4తో డ్రాగా ముగిసింది. దీని కారణంగా ఫలితాన్ని నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. శనివారం పాకిస్థాన్‌పై భారత క్రికెట్ జట్టు ఓడిపోగా, హాకీ జట్టు విజయం సాధించింది.

షూటౌట్‌లో భారత్ తరఫున మణిందర్ సింగ్, గుర్జోత్ సింగ్ గోల్స్ చేశారు. కాగా షూటౌట్‌లో పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ లియాకత్, మహ్మద్ మొర్తజాలను భారత వికెట్ కీపర్ సూరజ్ కర్కెరా గోల్ చేయకుండా అడ్డుకున్నాడు. భారత్ తరఫున మహ్మద్ రహీల్ ఫుల్ టైమ్‌లో రెండు గోల్స్ చేశాడు. దీంతో పాటు జుగ్‌రాజ్ సింగ్, మణిందర్ సింగ్ 1-1 గోల్స్ చేశారు. జట్టు తరఫున రహీల్ 19, 26వ నిమిషాల్లో గోల్ చేశాడు. 7వ నిమిషంలో జుగ్రాజ్ సింగ్ గోల్ చేయగా, 10వ నిమిషంలో మణిందర్ సింగ్ గోల్ సాధించాడు.

కాగా, పాకిస్థాన్ తరఫున పూర్తి సమయంలో అబ్దుల్ రెహ్మాన్, జికారియా హయత్, అర్షద్ లియాకత్, కెప్టెన్ అబ్దుల్ రానా 1-1 గోల్‌తో స్కోరును 4-4తో సమం చేశారు. దీని తర్వాత గేమ్ పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లింది. అక్కడ భారత్ 2-0తో గెలిచింది. అంతకుముందు ఎలైట్ పూల్ దశలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 4-5 తేడాతో ఓడిపోయింది. ఫైనల్‌లో విజయం సాధించిన భారత్‌కు ప్రధాని అభినందనలు తెలిపారు.

“అద్భుతమైన విజయం సాధించిన పురుషుల హాకీ జట్టుకు అభినందనలు. ఇది మా ఆటగాళ్ల అచంచలమైన అంకితభావానికి నిదర్శనం, ఈ విజయంతో వచ్చే ఏడాది ఒమన్‌లో జరిగే హాకీ 5 ప్రపంచకప్‌లో మేము మా స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాము. మా ఆటగాళ్ల దృఢ సంకల్పం మన దేశానికి స్ఫూర్తినిస్తాయి. హాకీ 5s ఆసియా కప్‌లో ఛాంపియన్!!” అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.