Ishan Kishan Breaks Virat Kohli Record in Asia Cup 2023: ఆసియా కప్ 2023లో భాగంగా శనివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలమైన చోట పాకిస్తాన్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని పరుగులు చేశాడు. కీలకం సమయంలో 82 పరుగులు చేసి భారత జట్టును ఆదుకున్నాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కిషన్, హార్దిక్ భాగస్వామ్యంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది.
పాకిస్తాన్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 17 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు 17 ఇన్నింగ్స్‌లలో ఇషాన్ 776 పరుగులు చేశాడు. దాంతో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని అతడు అధిగమించాడు. కోహ్లీ 17 ఇన్నింగ్స్‌ల తర్వాత 757 పరుగులు చేశాడు. ఈ జాబితాలో శుబ్‌మన్ గిల్ (778) అగ్ర స్ధానంలో ఉన్నాడు.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్ కొన్ని ఆందోళనలకు తెరదించింది. ఆసియా కప్ సహా ప్రపంచకప్ 2023కు వికెట్ కీపర్ ఇషాన్ అనే విషయం స్పష్టం అయింది. అలాగే మిడిలార్డర్ సమస్యకూ పరిష్కారం చూపింది. ఈ ఇన్నింగ్స్‌తో ప్రపంచకప్‌లో సంజు శాంసన్‌కు దారులు మూసుకుపోయినట్లు అయింది. వెస్టిండీస్ పర్యటనలో నిరాశ పరిచిన సంజూ.. ఆసియా కప్‌నకు బ్యాకప్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. కేఎల్ రాహుల్ తప్పుకుంటేనే అతడికి చోటు దక్కుతుంది. ఒకవేళ జట్టులోకి వచ్చినా తుది జట్టులో మాత్రం ఇషాన్‌ను దాటి అవకాశం దక్కించుకోవడం అసాధ్యమే.