Jasprit Bumrah and Sanjana Ganesan is expecting the birth of first child: ఆసియా కప్ 2023కోసం శ్రీలంకలో ఉన్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో అత్యవసరంగా స్వదేశానికి తిరిగి వచ్చాడు. దాంతో నేపాల్‌తో సోమవారం జరిగే మ్యాచ్‌కు బుమ్రా దూరమయ్యాడు. బుమ్రా భారత్‌కు వచ్చిన విషయంపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే బుమ్రా స్వదేశానికి తిరిగి రావడంపై సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బుమ్రా ఉన్నపళంగా స్వదేశానికి ఎందుకు పయనమయ్యాడు, కుటుంబ సభ్యుల్లో ఎవరైన అనారోగ్యానికి గురయ్యారా? అని ఫాన్స్ సందేహం వ్యక్తం చేశారు.
తాజా సమాచారం ప్రకారం… జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే తండ్రి కాబోతున్నాడట. బుమ్రా సతీమణి, స్టార్ స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేషన్ త్వరలో బిడ్డకు జన్మనివ్వనుందట. సంజనా డెలివరీకి సమయం దగ్గరపడటంతోనే బుమ్రా ఉన్నపళంగా స్వదేశానికి వచ్చినట్లు తెలుస్తోంది. డెలివరీ సమయంలో భార్యకు తోడుగా ఉండేందుకు బీసీసీఐ అనుమతితోనే బుమ్రా ముంబైకి వచ్చాడట. మరో రెండు రోజుల్లో పేస్ గుర్రం అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే 1-2 రోజులు ఆగాల్సిందే.
వెన్ను గాయంతో దాదాపుగా ఏడాది పాటు భారత జట్టుకు జస్ప్రీత్ బుమ్రా దూరంగా ఉన్నాడు. శస్త్రచికిత్స అనంతరం ఎన్సీఏలో ఫిట్‌నెస్ సాధించి ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో పునరాగమనం చేశాడు. ఐర్లాండ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన బుమ్రా.. అక్కడి నుంచి నేరుగా ఆసియా కప్ 2023కోసం శ్రీలంక చేరుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో నేపాల్‌తో జరిగే మ్యాచ్‌కు దూరమయ్యాడు. సూపర్-4 మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండనున్నాడు.