Leading News Portal in Telugu

Rahkeem Cornwall: 12 సిక్స్‌లతో వీరవిహారం.. 48 బంతుల్లో ‘బహుబలి’ సెంచరీ!


Rahkeem Cornwall Smashes 45 Ball Century in CPL 2023: క్రికెట్‌లో అత్యంత భారీ కాయుడు, విండీస్‌ బహుబలి రకీం కార్న్‌వాల్ భారీ శతకంతో చెలరేగాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌ (సీపీఎల్) 2023లో భాగంగా ఆదివారం సెయింట్ కిట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బార్బడోస్ రాయల్స్ ఆల్‌రౌండర్‌ కార్న్‌వాల్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసిన విండీస్‌ బహుబలి 45 బంతుల్లోనే సెంచరీ చేశాడు. కార్న్‌వాల్ ఇన్నింగ్స్‌లో 12 సిక్స్‌లు, 4 ఫోర్లు ఉన్నాయి. ఇందుకుసంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బార్బడోస్ రాయల్స్ బ్యాటర్ రకీం కార్న్‌వాల్ మొత్తంగా 48 బంతులు ఎదుర్కొని 102 పరుగులు చేసి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. టీ20 క్రికెట్‌లో కార్న్‌వాల్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఇక సీపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ బాదిన మూడో ఆటగాడిగా బహుబలి రికార్డుల్లోకెక్కాడు. కార్న్‌వాల్ కొట్టిన ఓ సిక్స్ ఏకంగా స్టేడియం బయట పడింది. 101 మీటర్లు వెళ్లిన ఆ సిక్స్ కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియం బయట పడింది.

ఈ మ్యాచ్‌లో సెయింట్ కిట్స్‌పై బార్బడోస్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సెయింట్ కిట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 రన్స్ చేసింది. ఫ్లెచర్‌ (56), విల్‌ స్మిద్‌ (63), రుథర్‌ఫర్డ్‌ (65) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. బార్బోడస్‌ బౌలర్లలో కార్నవాల్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బార్బడోస్.. మరో 11 బంతులు ఉండగానే ఛేదించింది. కార్న్‌వాల్‌ సహా పావెల్‌ (49) చెలరేగాడు.