ఆసియా కప్ 2023 టోర్నీని వర్షం వదిలిపెట్టడం లేదు. ఇండియా – పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వరుణుడి దెబ్బకు ఫలితం తేలకుండా రద్దు కాగా, ఇండియా- నేపాల్ మ్యాచ్‌ని కూడా వాన అడ్డుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమయానికి 37.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన నేపాల్ 178 పరుగులు చేసింది.
అయితే, టాస్ ఓడి బ్యాటింగ్ స్టార్ట్ చేసిన నేపాల్ జట్టుకి భారత ఫీల్డర్ల చెత్త ఫీల్డింగ్ బాగా కలిసి వచ్చింది. మొదటి 5 ఓవర్లలో టీమిండియా ఫీల్డర్లు 3 గోల్డెన్ క్యాచ్ లను డ్రాప్ చేశారు. దీన్ని వాడుకున్న నేపాల్ ఓపెనర్లు 9.5 ఓవర్లలో తొలి వికెట్‌కి 65 పరుగుల భాగస్వామ్యం జత చేశారు. కుశాల్ బుర్టెల్ ( 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు ) శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. భీం శక్తి ( 17 బంతుల్లో 7 పరుగులు )ని రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేయగా.. నేపాల్ కెప్టెన్ రోహిత్ పాడెల్ ( 8 బంతుల్లో 5 పరుగులు ) ను కూడా జడ్డూ బౌలింగ్‌లో రోహిత్ శర్మకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
ఇక, కుశాల్ మల్ల ( 5 బంతుల్లో 2 పరుగులు )ను సైతం జడ్డూ బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో నేపాల్ జట్టు వెంటవెంటనే 3 వికెట్లు కోల్పోయింది. 65/0 స్థితిలో ఉన్న నేపాల్ టీమ్ 101/4 స్థితికి చేరుకుంది. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో కుదురుకుపోయిన ఓపెనర్ ఆసిఫ్ షేక్ ( 97 బంతుల్లో 8 ఫోర్లతో 58 పరుగులు ) హాఫ్ సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీ తర్వాత సిరాజ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఆసిఫ్ అవుట్ అయ్యాడు. గుల్షాన్ జా ( 35 బంతుల్లో 3 ఫోర్లతో 23 పరుగులు ) కూడా మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లోనే ఇషాన్ కిషన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.
144 పరుగులకు నేపాల్ టీమ్ ఆరో వికెట్లు కోల్పోయింది. వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి దీపేంద్ర సింగ్ ఆరీ ( 20 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు ), సోమ్‌పాల్ కమీ (20 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు) క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ ఇప్పటికే ఏడో వికెట్‌కి 36 బంతుల్లో 34 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.